Share News

Andhra Pradesh School Reform: ప్రతి తరగతికీ టీచర్‌

ABN , Publish Date - May 14 , 2025 | 04:28 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు జీవో 19ని విడుదల చేసింది. నూతన విధానంలో 9 రకాల పాఠశాలల కేటగిరీలను ప్రవేశపెట్టి, ఉపాధ్యాయ పోస్టుల కేటాయింపును హేతుబద్ధీకరించింది.

Andhra Pradesh School Reform: ప్రతి తరగతికీ టీచర్‌

ప్రతి తరగతికీ పాఠశాలల పునర్వ్యవస్థీకరణ

9 రకాలుగా స్కూళ్ల విభజన

4 రకాల ఉన్నత పాఠశాలలు

కొత్తగా మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు

3,228 పోస్టులు సృష్టి

క్షేత్రస్థాయిలో క్లస్టర్‌ టీచర్లు

వైసీపీ జీవో 117 ఉపసంహరణ

కొత్త విధానంపై జీవో 19 జారీ

ఈ విద్యాసంవత్సరం నుంచే..

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): సర్కారీ స్కూళ్లను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద జీవో 117కు స్వస్తి పలికి, కొత్త విధానంపై జీవో 19 విడుదల చేసింది. దీనికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను హేతుబద్ధీకరిస్తూ మరో జీవో 21ని జారీ చేసింది. ప్రభుత్వ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌, గిరిజన సంక్షేమ పాఠశాలలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని జీవోలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆరు రకాల బడుల విధానం అమల్లో ఉండగా, నూతన విధానంలో 9 రకాలుగా విభజించారు. ‘మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు’ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతున్న నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ బడుల్లో ప్రతి తరగతికీ ఒక టీచర్‌ను కేటాయిస్తారు. అలాగే ఉన్నత పాఠశాలలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. వీటిలో ‘హైస్కూల్‌ ప్లస్‌’లు కూడా ఉన్నాయి. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా త్వరలో బదిలీలు చేపడతారు. అలాగే క్లస్టర్‌ లెవెల్‌ అకడమిక్‌ టీచర్‌ అనే నూతన విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఎవరైనా టీచర్లు సెలవు పెడితే వారి స్థానంలో క్లస్టర్‌ టీచర్లు తాత్కాలికంగా విధులకు హజరవుతారు.

hgyk.jpg

పోస్టుల హేతుబద్ధీకరణ

నూతన బడుల విధానానికి అనుగుణంగా పోస్టులను హేతుబద్ధీకరించారు. నూతన విధానంలో ఫౌండేషనల్‌ స్కూల్‌లో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను కేటాయిస్తారు. 31-60 మంది విద్యార్థులుంటే రెండో టీచర్‌ పోస్టు కేటాయిస్తారు. బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌లో 20 మంది విద్యార్థులకు ఒక టీచర్‌, 21-60 మంది విద్యార్థులకు రెండో టీచర్‌ను ఇస్తారు. మోడల్‌ ప్రైమరీ స్కూల్‌లో 59 మంది విద్యార్థుల వరకు ఒక హెచ్‌ఎం, 3 ఎస్జీటీలను ఇస్తారు. 60-150 మంది ఉంటే ఒక హెచ్‌ఎం, 4 ఎస్జీటీలను కేటాయిస్తారు. ఆ తర్వాత ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఎస్జీటీ చొప్పున కేటాయిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలో 1-5 తరగతుల వరకు బేసిక్‌ లేదా మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ ప్రకారం టీచర్లను కేటాయిస్తారు. 6-8 తరగతులలో 10 మంది విద్యార్థులకు ఒక స్కూల్‌ అసిస్టెంట్‌, 11-30 మందికి ఇద్దరు, 31-140 మందికి నలుగురు, 141-175 మంది విద్యార్థులు ఉంటే ఐదుగురు స్కూల్‌ అసిస్టెంట్లను నియమిస్తారు. ఉన్నత పాఠశాలల్లో 1-5 తరగతుల విద్యార్థుల సంఖ్య 60లోపు ఉంటే 10 మంది విద్యార్థులకు రెండు, 11-30 వరకు మూడు, 31-59 వరకు ఒక హెచ్‌ఎం, మూడు ఎస్జీటీ పోస్టులు కేటాయిస్తారు. 60 దాటితే బేసిక్‌ లేదా మోడల్‌ ప్రైమరీ పాఠశాల ప్రకారం టీచర్లను కేటాయిస్తారు. ఉన్నత పాఠశాలల్లో 75 లేదా అంతకంటే తక్కువ మంది విద్యార్థులుంటే హెచ్‌ఎం, పీఈటీ పోస్టు ఉండదు. సీనియర్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ హెచ్‌ఎం విధులు నిర్వహిస్తారు. 75 మంది దాటితే ఆ స్కూల్‌కు హెచ్‌ఎం, పీఈటీ పోస్టు ఇస్తారు. విద్యార్థుల సంఖ్య 400 దాటితే రెండో పీఈటీ, 751 దాటితే మూడో పీఈటీని నియమిస్తారు.


మోడల్‌ ప్రైమరీ స్కూళ్లకు హెచ్‌ఎంలుగా ఎస్‌ఏలు

కొత్తగా ఏర్పాటు చేయనున్న మోడల్‌ ప్రైమరీ స్కూళ్లలో 4,706 చోట్ల స్కూల్‌ అసిస్టెంట్లను హెచ్‌ఎంలుగా నియమించనున్నారు. మిగులు స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీలను క్లస్టర్‌ లెవెల్‌ అకడమిక్‌ టీచర్లుగా క్లస్టర్‌ పాఠశాలల్లో నియమిస్తారు. ఆ క్లస్టర్‌లో ఎవరైనా టీచర్‌ సెలవు పెడితే అక్కడ క్లస్టర్‌ టీచర్‌ తాత్కాలికంగా పనిచేస్తారు. 615 స్కూల్‌ అసిస్టెంట్‌, ఎస్జీటీ పోస్టులను అదే మేనేజ్‌మెంట్లలో అవసరాలకు అనుగుణంగా నియమిస్తారు. 3,980 ఖాళీ పోస్టులు రద్దు, హెచ్‌వోడీ పూల్‌లో ఉన్న 1311 పోస్టుల సర్దుబాటు ద్వారా కొత్తగా 3,228 పోస్టులను సృష్టిస్తారు. వీటిలో 397 గ్రేడ్‌-2 హెచ్‌ఎం పోస్టులు, 2,709 స్కూల్‌ అసిస్టెంట్‌, 122 ఎస్జీటీ పోస్టులున్నాయి. 779 ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చేస్తారు. 1902 పోస్టులు హెచ్‌వోడీ విభాగానికి అనుసంధానించి భవిష్యత్తులో అవసరమైన చోటకు సర్దుబాటు చేస్తారు.


నూతన బడులు ఇవీ..

శాటిలైట్‌ ఫౌండేషనల్‌ స్కూల్‌

ప్రాథమిక పాఠశాలలకు ఒక కిలోమీటరు కంటే ఎక్కువ దూరంలో ఉన్న అంగన్‌వాడీ సెంటర్లను ‘శాటిలైట్‌ ఫౌండేషనల్‌ స్కూల్‌’గా పేర్కొంటారు. ఇవి సమీపంలోని ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానంగా పనిచేస్తాయి. వీటిలో ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2 తరగతులు ఉంటాయి. అక్కడ అంగన్‌వాడీ వర్కర్‌ పనిచేస్తారు.

ఫౌండేషనల్‌ స్కూల్‌

ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2తో పాటు 1, 2 తరగతులుంటాయి. ప్రాథమిక పాఠశాలల ప్రాంగణంలోనే అంగన్‌వాడీ కేంద్రాలుంటాయి. 1, 2 తరగతులకు ఎస్జీటీలు, ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2లకు అంగన్‌వాడీ వర్కర్‌ను కేటాయిస్తారు.

బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌

ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2, 1-5 తరగతులు ఉంటాయి. ఈ బడుల్లో 1 నుంచి 5 తరగతుల విద్యార్థుల సంఖ్య 59 వరకు ఉంటుంది. 1-5 తరగతులకు ఎస్జీటీలు, ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2లకు అంగన్‌వాడీ వర్కర్‌ను కేటాయిస్తారు.

మోడల్‌ ప్రైమరీ స్కూల్‌

ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2, 1-5 తరగతులు ఉంటాయి. ఈ బడుల్లో 1-5 తరగతుల విద్యార్థుల సంఖ్య 60 లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. 1-5 తరగతులకు ఎస్జీటీలు, ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2లకు అంగన్‌వాడీ వర్కర్‌ను ఇస్తారు.

ప్రాథమికోన్నత పాఠశాల

ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2, 1-8 తరగతులు ఉంటాయి. ఈ పాఠశాలల్లో 1-5 తరగతులకు ఎస్జీటీలు, 6-8 తరగతులకు ఎస్జీటీలు లేదా స్కూల్‌ అసిస్టెంట్లు బోధిస్తారు. 1-5 తరగతులకు బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌ లేదా మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ విద్యార్థుల సంఖ్య ప్రకారం టీచర్లను కేటాయిస్తారు. ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2కు అంగన్‌వాడీ వర్కర్‌ ఉంటారు.

ఉన్నత పాఠశాల(6-10)

6-10 తరగతులుంటాయి.

స్కూల్‌ అసిస్టెంట్లు బోధిస్తారు.

ఉన్నత పాఠశాల(1-10)

1-10 తరగతులు ఉంటాయి. 1-5 తరగతులకు ఎస్జీటీలు, 6-10 తరగతులకు స్కూల్‌ అసిస్టెంట్లు బోధిస్తారు. ఉన్నత పాఠశాల హెచ్‌ఎం అన్ని తరగతులకు పని సర్దుబాటు చేస్తారు.

ఉన్నత పాఠశాల ప్లస్‌(6-12)

612 తరగతులుంటాయి. ఇంటర్మీడియట్‌తో సహా అన్ని తరగతులకు స్కూల్‌ అసిస్టెంట్లు బోధిస్తారు. ఉన్నత పాఠశాల ప్లస్‌లలో హెచ్‌ఎం పని సర్దుబాటు చేస్తారు.

ఉన్నత పాఠశాల ప్లస్‌(1-12)

112 తరగతులుంటాయి. 1-5 తరగతులకు ఎస్జీటీలు, 6-12 తరగతులకు స్కూల్‌ అసిస్టెంట్లు బోధిస్తారు. ఉన్నత పాఠశాలల హెచ్‌ఎం పని సర్దుబాటు చేస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 04:28 AM