Share News

AP Green Power: ఏపీ నుంచి గుజరాత్‌కు విద్యుత్‌

ABN , Publish Date - May 09 , 2025 | 05:34 AM

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన 1 గిగావాట్‌ పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి గుజరాత్‌లోని ఏఎంఎన్‌ఎస్‌కు విద్యుత్‌ సరఫరా ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా 1.5 మిలియన్‌ టన్నుల కార్బన్‌ ఉద్గారాలు తగ్గనున్నాయి

AP Green Power: ఏపీ నుంచి గుజరాత్‌కు విద్యుత్‌

  • ఏఎంఎన్‌ఎస్‌కు పునరుత్పాదక విద్యుత్‌ సరఫరా ప్రారంభం

  • ఆర్సెలార్‌ సీఈవో ఆదిత్య మిట్టల్‌ వెల్లడి

న్యూఢిల్లీ, మే 8: పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తికి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ మరో ఘనత సాధించింది. మన రాష్ట్రంలో నిర్మించిన తన 1 గిగావాట్‌ ఏఎం గ్రీన్‌ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు నుంచి గుజరాత్‌కు విద్యుత్‌ సరఫరాను ఆర్సెలార్‌ మిట్టల్‌ ప్రారంభించింది. సుమారు రూ. 5,900 కోట్లకు పైగా పెట్టుబడితో ఏపీలో నిర్మించిన తన సొంత సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి గుజరాత్‌లోని ఆర్సెలార్‌ మిట్టల్‌, నిప్పన్‌ స్టీల్‌ (ఏఎంఎన్‌ఎస్‌) ఇండియా ప్రాజెక్టుకు తాజాగా సరఫరా మొదలు పెట్టింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తమ అతిపెద్ద పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి ఏఎంఎన్‌ఎస్‌కు క్లీన్‌ ఎనర్జీని అందించడం ప్రారంభమైంది అని ఆర్సెలార్‌ మిట్టల్‌ సంస్థ గురువారం తెలిపింది. ఈ విద్యుత్‌ సరఫరాతో ఏఎంఎన్‌ఎస్‌ నుంచి ఏటా 1.5 మిలియన్‌ టన్నుల కార్బన్‌ ఉద్గారాలను తగ్గే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆర్సెలార్‌ మిట్టల్‌ సీఈవో ఆదిత్య మిట్టల్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టే తమ తొలి అతి పెద్ద పునరుత్పాదక ప్రాజెక్టు అని వెల్లడించారు. 18 నెలల్లో దానిని విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. ఏపీలో 2,400 ఎకరాల్లో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌లో 15 లక్షల విద్యుత్‌ ప్యానల్స్‌ను, 700 ఎకరాల్లో 91 విండ్‌ టర్బయిన్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే 2.5 కిలోవాట్‌ హవర్స్‌తో కోటి కుటుంబాల్లో వెలుగులు నింపవచ్చన్నారు.

Updated Date - May 09 , 2025 | 05:34 AM