Timmappa Hill: కోసిగి తిమ్మప్ప కొండపై క్రీస్తుపూర్వం ఆనవాళ్లు
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:18 AM
క్రీస్తుపూర్వం శిలాయుగం నాటి సమాధులను కర్నూలు జిల్లాలో గుర్తించారు..
శిలాయుగం నాటి సమాధులుగా గుర్తింపు
పరిశీలించిన పురావస్తు శాఖ అధికారులు
కోసిగి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): క్రీస్తుపూర్వం శిలాయుగం నాటి సమాధులను కర్నూలు జిల్లాలో గుర్తించారు. కోసిగి మండలం తిమ్మప్ప కొండపై ఉన్న ఈ సమాధులను పురావస్తు, ప్రదర్శన శాలల సహాయకులు బి మహేంద్రనాయుడు ఆదివారం తన బృందంతో కలిసి పరిశీలించారు. తిమ్మప్ప కొండపై కొన్ని పురావస్తు ప్రాధాన్యత కలిగిన సమాధులను.. ఆవుల రాఘవేంద్ర, కానిస్టేబుల్ నాగన్న, కోసిగి వాసులు రాముడు, ఈరన్న బృందం గుర్తించి పురావస్తు శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతపురం ప్రాంతీయ సహాయ సంచాలకుడు ఎం.స్వామినాయక్ ఆదేశాల మేరకు తిమ్మప్ప కొండపై ఉన్న ఈ సమాధులను పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. ఒక కిలోమీటరు పరిధిలో ఉన్నవాటిని పరిశీలించి.. ఇవి బహుశా క్రీస్తు పూర్వం 600 నుంచి 1000 సంవత్సరాలకు చెందినవిగా గుర్తించామని చెప్పారు. ఈ సందర్భంగా మహేంద్రనాయుడు మాట్లాడుతూ.. తిమ్మప్ప కొండపై ఉన్న సమాధులు పురావస్తు పరంగా అత్యంత ప్రాధాన్యత కలిగినవని చెప్పారు. చారిత్రక స్పృహ లేకపోవడం వల్ల.. గొర్రెలు, పశువుల కాపరులు, ప్రజలు కొన్నింటిని ధ్వంసం చేశారని, మిగిలి ఉన్న ఆనాటి సమాధులు, మనుషుల పాద ముద్రలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వీటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.