Share News

యాడికి గ్రామ పంచాయతీ ఖాళీ

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:55 PM

యాడికి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉద్యోగులు లేక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఆరునెలల క్రితం పంచాయతీ కార్యదర్శి అశ్వర్థమనాయుడు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి డిప్యూటి ఎంపీడీఓ శశికళ ఇనఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

యాడికి గ్రామ పంచాయతీ ఖాళీ
కార్యాలయంలో ఖాళీగా ఉన్న అధికారుల కుర్చీలు

యాడికి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): యాడికి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉద్యోగులు లేక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఆరునెలల క్రితం పంచాయతీ కార్యదర్శి అశ్వర్థమనాయుడు బదిలీ అయ్యారు. అప్పటి నుంచి డిప్యూటి ఎంపీడీఓ శశికళ ఇనఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. యాడికి మేజర్‌ పంచాయతీ కావడంతో ఇనఛార్జ్‌ పాలన కష్టంగా మారింది. డిప్యూటి ఎంపీడీఓ బాధ్యతలే ఎక్కువగా ఉన్నాయి. యాడికి పంచాయతీ కార్యదర్శి విధులు తనకు వద్దని ఉన్నతాధికారుల వద్ద ఆమె కూడా తన నిస్సాహాయతను వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం. అయినా ఉన్నతాధికారులు కార్యదర్శిని ఇంతవరకూ నియమించలేదు. యాడికి గ్రామపంచాయతీ కార్యాలయంలోని ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లలో అనారోగ్యం కారణంగా పదిహేను రోజులు సెలవులో వెళ్లారు. ఒకరు వారంరోజుల క్రితం డిప్యూటేషనపై అనంతపురం వెళ్లారు. పారిశుధ్య పనులను పర్యవేక్షించే మేస్త్రీ ఒకరు మాత్రమే గ్రామపంచాయతీ కార్యాలయానికి పెద్ద దిక్కు అయ్యారు. అతను కూడా అనారోగ్యంతో విధులు నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇలా అధికారులు, సిబ్బంది కొరతతో గ్రామపంచాయతీ పాలన కుంటుపడింది. పారిశుధ్య పనులు, పన్నుల వసూలు అరకొరగా సాగుతున్నాయి. పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడానికి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. వివిధ పనుల నిమిత్తం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వస్తున్న ప్రజలు అధికారులు లేక నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Dec 18 , 2025 | 11:55 PM