అవిశ్వాసం నెగ్గేనా..?
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:14 PM
మంత్రి పయ్యావుల కేశవ్ మండలంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడైన వైసీపీ నేత, ఎంపీపీ పెద్దన్న టీడీపీలో చేరారు.
బెళుగుప్ప, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): మంత్రి పయ్యావుల కేశవ్ మండలంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడైన వైసీపీ నేత, ఎంపీపీ పెద్దన్న టీడీపీలో చేరారు. అనేక మంది వైసీపీ ఎంపీటీసీలు టీడీపీకి మద్దతుపలికారు. దీంతో ఎలాగైన ఎంపీపీ పెద్దన్నను ఆ పదవి నుంచి తొలగించడానికి వైసీపీ నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. వైసీపీ పాలనలో 12 ఎంపీటీసీ స్థానాలనూ ఆ పార్టీ వారే కైవశం చేసుకున్నారు. ఎంపీపీగా రెండున్నరేళ్ల పెద్దన్న.. మరో రెండున్నరేళ్లు శ్రీరంగాపురం ఎంపీటీసీ వరలక్ష్మీ పదవిలో ఉండేలా నాడు పార్టీ నాయకులు మొదట నిర్ణయించారు. అయితే పెద్దన్న గడు వు ముసిగినా... మహిళా ఎంపీపీగా ఉండి పరిపాలన కొనసాగించడం ఇబ్బందిగా ఉంటుందని, ఎంపీపీగా పెద్దన్ననే ఉండాలని నియోజకవర్గ నాయకుడు ఆదేశాల మేర కు ఆయన్ను కొనసాగించారు. ఇక మరో నాలుగు నెలల్లో ఆ పదవి కాలమూ పూర్తి కానుంది. కాగా, కూటమి ప్రభు త్వం అధికారంలోకి రావడం.. స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉండటంతో అభివృద్ధి పరుగులు తీసింది. ఇటీవల నిర్వహించిన మండల సమావేశంలో ఎంపీపీ పెద్దన్న మాట్లాడుతూ.. ‘మన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నారు. అభివృద్ధి బాగా చేస్తున్నారు. సమష్టిగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇది మంచి అవకాశం.. సద్వినియోగం చేసుకుందాం.’ అని మంత్రిని ప్రశంసించారు. దీన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. పెద్దన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి సిద్దమయ్యారు. అంతేకాకుండా గతంలో మాట్లాడుకున్న ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు. కాలపరిమితి ముగిసిందని, ఎంపీపీగా దిగిపోవాలని డిమాండ్ చేశారు. దీంతో అభివృద్ధివైపు మొగ్గు చూపిన పెద్దన్న.. మంత్రి పయ్యావుల కేశవ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎలాగైనా పెద్దన్నను ఎంపీపీగా తొలగించాలని.. అవిశ్వాసం పెట్టాలని.. పది మంది ఎంపీటీసీలు ఆర్డీఓ వద్ద సంతకాలు చేశారు. కాగా, ప్రస్తుతం తగ్గుపర్తి, బెళుగుప్ప, బెళుగుప్ప తండా ఎంపీటీసీ పెద్దన్నకు అనుకూలంగా ఉన్నారు. ఈనెల 17న నిర్వహించిన మండల సమావేశానికి కేవలం ఏడుగురు మాత్రమే హాజరయ్యారు. దీంతో వైసీపీలో ఆశలు సన్నగిల్లాయి. అవిశ్వాసంలో నెగ్గాలంటే 12 మంది ఎంపీటీసీల్లో ఎనిమిది మంది మద్దతు అవసరం. కాని ఏడుగురే ఉన్నారు. మరో ఎంపీటీసీ మద్దతు తప్పనిసరి. కాలువపల్లి ఎంపీటీసీని తమ వైపు తిప్పుకుంటే నెగ్గుతామన్నా ఆలోచనతో వైసీపీ నాయకులు రాయబేరాలు నడుపుతున్నారు. టీడీపీ నాయకులు కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికుట్రలు పన్నినా తమదే విజయమంటూ టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.