TDP MINORITY : అబుల్ కలాం విగ్రహాన్ని ఎందుకు పెట్టించలేదు?
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:11 AM
అబుల్ కలాం విగ్రహాన్ని నాలుగేళ్లుగా ఎందుకు పెట్టించలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని ఆ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు నిలదీశారు.

అనంతపురం అర్బన, మార్చి 13(ఆంధ్రజ్యోతి): అబుల్ కలాం విగ్రహాన్ని నాలుగేళ్లుగా ఎందుకు పెట్టించలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరిని ఆ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు నిలదీశారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మైనార్టీ నాయకులు ఫిరోజ్ అహ్మద్, ముక్తియార్, సైఫుద్దీన, ఇస్మాయిల్, జేఎం బాషా, ముస్తాక్ మీడియాతో మాట్లాడారు. మైనార్టీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో అబుల్ కలాం విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేస్తే బాగుంటుందని తామే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామన్నారు. కొత్త విగ్రహం తెప్పిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి చెప్పగా.. అంత సమయం లేదని రోడ్డు విస్తరణలో తొలగించిన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే అధికారులను ఆదేశించి, 11 రోజుల్లోనే విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించేలా చర్యలు తీసుకున్నారన్నారు. విగ్రహాన్ని తొలగించి నాలుగేళ్లు అయినా ఎందుకు ఏర్పాటు చేయించలేకపోయారని ప్రభాకర్ చౌదరిని ప్రశ్నించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి నగర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని, ఇకనుంచైనా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు.