college జూనియర్ కళాశాల ప్రారంభమెప్పుడో..?
ABN , Publish Date - Apr 19 , 2025 | 11:01 PM
మండల కేంద్రంలోని ఇంటర్ కళాశాల ఎప్పుడు ప్రారంభం అవుతోందనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారు.
గాండ్లపెంట, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఇంటర్ కళాశాల ఎప్పుడు ప్రారంభం అవుతోందనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో నాబార్డు నిధులు రూ.25 లక్షలతో ఎనిమిది గదులను కళాశాల కోసం నిర్మించింది. స్థానిక జిల్లాపరిషత ఉన్నత పాఠశాల ఆవరణంలో ఈ భవనాన్ని నిర్మించి.. మూడేళ్లు అవుతున్నా.. నాటి.. నేటి పాలకులు, అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో మండలంలోని ఇంటర్ విద్యార్థులు వందలాది మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకొంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారు చదువుకు దూరం అవుతున్నారు. మండలంలో గాండ్లపెంట, కటారుపల్లి, తుమ్మలబైలు, నీరుకుంట్లపల్లి, రెక్కమాను, కేజీవిబి, ఆదర్శ ప్రైవేటు పాఠశాల, రెక్కమాను శాంతినికేతన పాఠశాలలో సుమారు 370 మంది విద్యార్థులు ఈ సంవత్సరం టెన్త పరీక్షలు రాశారు. ఈ సంవత్సరమైనా ఇక్కడ ఇంటర్ కళాశాలను ప్రారంభిస్తే .. తమ పిల్లలను ఇతర ప్రాంతాలకు చదువు కోసం పంపే బాధలు తప్పుతాయని తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరమైనా ఇంటర్ కళాశాలను ప్రారంభించేలా పాలకులు, అ ధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై హెచఎం సిద్దారెడ్డి వివరణ కోరగా.. ఇంటర్ కళాశాల ప్రారంభానికి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని, వస్తే ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.