రథానికి మోక్షమెన్నడో..?
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:13 AM
మండలంలోని పెన్నహోబిలం లక్ష్మినరసింహస్వామి ఆలయ నూతన రథం తయారీ పనులకు రెండేళ్లయినా ఓ కొలిక్కి రాలేదు. ఈ పనులు ఆగిపోయి ఏడాది అయ్యింది.
ఉరవకొండ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెన్నహోబిలం లక్ష్మినరసింహస్వామి ఆలయ నూతన రథం తయారీ పనులకు రెండేళ్లయినా ఓ కొలిక్కి రాలేదు. ఈ పనులు ఆగిపోయి ఏడాది అయ్యింది. రానున్న బ్రహోత్సవాల నాటికి కూడా పూర్తి అయ్యేది అనుమానమే. మూడేళ్ల క్రితం బ్రహోత్సవాల సమయంలో పాత రథానికి మరమ్మతులు చేస్తున్న సమయంలో రథం కూలి ధ్వంసమైన విషయం తెల్సిందే. బ్రహ్మోత్సవాలకు పాత రథానికే మరమ్మతులు చేయించి ఉత్సవాలు పూర్తి చేశారు. 2024 ఫిబ్రవరిలో నూతన రథం తయారీకి టెండర్లు పిలువగా.. రూ.1.78 కోట్లకు అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి దక్కించుకున్నారు. అయితే టెండర్ల సమయంలో అవకతవకలు జరిగాయన్న విమర్శలు రావడంతో.. కాంట్రాక్టరుతో సబ్‌లీజ్‌కు తీసుకున్న వారు ఆ పనులు ఆపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన బదిలీల్లో అధికారులు మారారు. రథం తయారీకి ఉపయోగించే సామగ్రి నాణ్యత లేదనే విమర్శలు వచ్చాయి. రథం తయారీ పనులు పరిశీలించి.. నమూనాను తయారు చేసిన తర్వాతే పనులు ప్రారంభించాలని దేవదాయ శాఖ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో రథం తయారీ పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఈఓ కూడా సెలవులో వెళ్లడంతో జిల్లా దేవదాయ శాఖాధికారి తిరుమల రెడ్డికి ఇనచార్జీ బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా సెలవులో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై ఇనచార్జీ ఈఓను ఫోనలో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన పనిచేయలేదు.