కందికి కలుపు బెదడ
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:23 AM
ఖరీ్‌ఫలో సాగు చేసిన కంది పంటకు కలుపు మొక్కల బెడద వెంటాడుతోంది.
బెళుగుప్ప, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఖరీ్‌ఫలో సాగు చేసిన కంది పంటకు కలుపు మొక్కల బెడద వెంటాడుతోంది. వేరుశనగ పంటలు సాగు చేసి నష్టాలపాలైన రైతులు నాలుగైదేళ్లుగా ప్రత్యామ్నాయంగా కందిపంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఎర్ర, నల్లరేగడి భూము ల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. మండలంతో పాటు కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాం తాలకు వెళ్లి కౌలుకు తీసుకుని వేలాది ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. మండలంలో ఈ యేడాది పది వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఇటీవల ఎడతెరపిలేని వర్షాలు కురుస్తుండటంతో పొలాల్లో కలుపు మొక్కలు విపరీతంగా పెరిగాయి. వాటిని తొలగించడం భారంగా మారుతోంది. సమయం లేదు. తేమ ఎక్కువగా ఉండటంతో గుంటకతో తొలగించడానికి వీలు కావడం లేదు. కూలీలతో కలుపు మొక్కలు తొలగించాలంటే ఆర్థిక భారం పడుతోంది. ఒక్కొక్క కూలీకు రూ. 250 చెల్లించాలి. మొక్కతో పాటు గడ్డి కూడా భారీ పెరిగింది. కంది పైరు ఏపుగా పెరగకుండా ఈ క లుపు మొక్కలు ఆటంకంగా మారుతున్నాయని, దిగుబడి తగ్గే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గడ్డి ప్రభావంతో పచ్చపురుగు కూడా ఆశిస్తుందని వాపోతున్నారు.