Share News

ఆదర్శ హాస్టల్‌లో నీటి కష్టాలు

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:28 AM

స్థానిక ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్‌లో తాగడానికి.. నిత్యావసరాలకు నీరులేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆదర్శ హాస్టల్‌లో నీటి కష్టాలు
గోడౌన నుంచి బాటిళ్లలో తాగు నీటిని తెచ్చుకుంటున్న విద్యార్థినులు

విడపనకల్లు, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): స్థానిక ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్‌లో తాగడానికి.. నిత్యావసరాలకు నీరులేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగు నీరు, ఇతర అవసరాల నీటి కోసం కిలోమీటర్‌ దూరంలో ఉన్న ఎనఆర్‌కే కోల్డ్‌ స్టోరేజ్‌ వద్దకు వెళ్లి రోజూ తెచ్చుకుంటున్నారు. రోజూ ఒక్కో విద్యార్థి నాలుగు, ఐదు బాటిళ్లలో తాగు నీరు.. ఇతర అవసరాలకు రెండు బకెట్ల నీటిని తెచ్చుకొంటున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం ఈ విద్యార్థినులకు ఇదే తంతు. స్టోరూజ్‌లో పని చేసే ఒక్క మనిషి తప్ప... అక్కడ జన సంచారం ఉండదు. అడవిని తలపించేలా ఆ ప్రాంతం ఉంటుంది. అలాంటి ప్రాంతానికి వెళ్లి రోజూ ఈ విద్యార్థినులు నీటిని తెచ్చుకుంటున్నారు. 2025 జూనలో ఈ పాఠశాల తెరచినప్పటి నుంచి ఇప్పటి వరకూ బాలికలు నీటి కోసం నిత్యం ఇలా పాట్లు పడుతూనే ఉన్నారు. అయినా ఏ ఒక్క అధికారీ ఇప్పటి వరకూ పట్టింకున్న పాపాన పోలేదు. దీనిపై ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ శశికళాను వివరణ కోరగా.. ‘ ఆదర్శ పాఠశాలలో బోరు నీరు వస్తుంది. ఆ నీటినే హాస్టల్‌ విద్యార్థులు తాగేందుకు తెప్పించి ఉంచుతాము. సెలవులు, బోరు చెడిపోయినప్పుడు తాగు నీటి సమస్య ఏర్పడింది. ఇకపై హాస్టల్‌లోనే మంచి నీటి క్యాన్లు ఏర్పాట్లు చేస్తాం. విద్యార్థులకు నీటి కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటాము.’ అని అన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 01:28 AM