విత్తనాల కోసం నిరీక్షణ
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:13 AM
సబ్సిడీ పప్పుశనగ విత్తనాల కోసం మండల రైతులు నిరీక్షిస్తున్నారు. నెల క్రితం పదును వర్షం కురవడంతో సుమారు నాలుగు వేల ఎకరాల్లో ఈ పంటను సాగుచేశారు.
యల్లనూరు, నవంబరు13(ఆంధ్రజ్యోతి): సబ్సిడీ పప్పుశనగ విత్తనాల కోసం మండల రైతులు నిరీక్షిస్తున్నారు. నెల క్రితం పదును వర్షం కురవడంతో సుమారు నాలుగు వేల ఎకరాల్లో ఈ పంటను సాగుచేశారు. వరుస వర్షాల కారణంగా సాగుచేసిన పప్పుశనగ పొలాల్లో మొలకలు రావడంతో పాటు తెగుళ్లు కూడా కనిపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల పంట కుళ్లిపోయింది. దీంతో రైతులు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పప్పుశనగను మరోసారి సాగుచేయడానికి సిద్ధమయ్యాడు. మండలంలో సుమారు ఆరు వేల ఎకరాల్లో ఈ పంట ప్రతి సంవత్సరం సాగవుతుంది. ఇందులో సుమారు నాలుగు వేల ఎకరాలకు పైగా విత్తనం వేయగా రెండు వేల ఎకరాలు మిగులు ఉంది. సబ్సిడీ ధర నిర్ణయించినప్పటికి ప్రభుత్వం విత్తనాలను సరఫరా చేయలేదు. రైతులు వ్యవసాయాధికారులను సంప్రదించినా వారి నుంచి సరైన సమాధానం రావడం లేదు. మండలంలో కాచర్లకుంట, జంగంపల్లి, పాతపల్లి, కృష్ణాపురం, వెన్నపూసపల్లి, వెంకటాద్రిపల్లి, యల్లనూరు గ్రామాల్లో నల్లరేగడి నేలలు అధికంగా ఉన్నాయి. ఈ నేలల్లో ఏటా పప్పుశనగ మాత్రమే సాగుచేస్తారు. జిల్లా వ్యవసాయాధికారులు స్పందించి త్వరగా సబ్సిడీ విత్తనాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కొంతమంది రైతులు మార్కెట్‌లో క్వింటా పప్పుశనగ రూ.6300కు కొనుగోలు చేసి.. విత్తనం వేశారు. ప్రస్తుతం సబ్సిడీ విత్తనాలు ఇవ్వకపోతే ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు.