wage samme: జీతం రావాలంటే సమ్మె చేయాల్సిందే
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:42 AM
wage samme: జీతం రావాలంటే సమ్మె చేయాల్సిందే wage samme: You have to go on strike to get your salary. జీతం రావాలంటే సమ్మె చేయాల్సిందేనా అని సత్యసాయి తాగునీటికార్మికులు వాపోతు న్నారు. ఈ తాగునీటి పథకంలో జిల్లాలో 550 మంది స్కిల్డ్, సెమీస్కిల్డ్, అనస్కిల్డ్ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరు తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ, కొత్తచెరువు, పుట్టపర్తి, ధర్మవరం ప్రాంతాలకు సక్రమంగా తాగునీటి సరఫరా చేయడంలో కీలకంగా వ్యవహరిస్తారు.
సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు
తాడిమర్రి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): జీతం రావాలంటే సమ్మె చేయాల్సిందేనా అని సత్యసాయి తాగునీటికార్మికులు వాపోతు న్నారు. ఈ తాగునీటి పథకంలో జిల్లాలో 550 మంది స్కిల్డ్, సెమీస్కిల్డ్, అనస్కిల్డ్ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరు తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ, కొత్తచెరువు, పుట్టపర్తి, ధర్మవరం ప్రాంతాలకు సక్రమంగా తాగునీటి సరఫరా చేయడంలో కీలకంగా వ్యవహరిస్తారు. ఎక్కడ పైప్‌లైన పగిలినా రిపేరీ వీరి బాధ్యతే. వీరు పని చేయకపోతే ఆయా ప్రాంతాలకు తాగునీటి సరఫరా బంద్ అవుతుంది. ఇంతటి కీలకంగా పని చేస్తున్న వీరికి ప్రతి నెలా జీతం మాత్రం సక్రమంగా అందడం లేదు. ఎప్పటికప్పుడు ధర్నాలు, నిరసనలు తెలిపితే తప్పా వేతనం అందని పరిస్థితి. గతనెల నుంచి వేతనం ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకునే వారులేరు.
దీంతో జీవనానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వారు వాపోతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యే సమయానికి ఏడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉండేవి. ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఏడునెలల వేతనాలు ఇవ్వడంతో పాటుగా ఆ తరువాత ఏడు నెలలపాటు బాగానే వచ్చాయి. ప్రస్తుతం మళ్లీ అదే పరిస్థితి నెలకొంది.
కార్మికులతో అధికారుల చర్చలు
సత్యసాయికార్మికులు ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నారని సమాచారం రావడంతో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ, డీఈ, కాంట్రాక్టర్‌లు కలిసి శనివారం సాయంత్రం అనంతపురంలో వారితో చర్చలు జరిపారు. ఒక నెల వేతనం మాత్రమే ఇవ్వడానికి అంగీకరించడంతో తాము సమ్మెలోకి వెళ్తామని కార్మికులు ఖరాఖండిగా తెలిపారు. దీంతో ఈనెల 16న అనంతపుం జిల్లా కలెక్టర్ తిరిగి రానున్నారని, ఆయనతో చర్చల అనంతరం నిర్ణయం తీసుకోవాలని వారు కార్మికులను కోరారు. దీనికి కార్మికులు అంగీకరించారు.