నెరవేరని నేమకల్లు హామీలు..!
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:59 PM
మం డలంలోని నేమకల్లులో గత ఏడాది నవంబరు 30న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజావేదిక నిర్వహించారు. గ్రామ అభివృద్ధి.. సమస్యల పరిష్కారంపై ఆ వేదికపై అనేక హామీలిచ్చారు. దీంతో తమ గ్రామ దశ తిరుగుతుందని ఆ గ్రామస్థులు ఆశించారు. అయితే ఏడాదైనా వాటి అమలుపై జిల్లా అధికారులు ఏ మాత్రం చొరవ చూపలేదు.
బొమ్మనహాళ్, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): మం డలంలోని నేమకల్లులో గత ఏడాది నవంబరు 30న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజావేదిక నిర్వహించారు. గ్రామ అభివృద్ధి.. సమస్యల పరిష్కారంపై ఆ వేదికపై అనేక హామీలిచ్చారు. దీంతో తమ గ్రామ దశ తిరుగుతుందని ఆ గ్రామస్థులు ఆశించారు. అయితే ఏడాదైనా వాటి అమలుపై జిల్లా అధికారులు ఏ మాత్రం చొరవ చూపలేదు. గ్రామంలో సీసీరోడ్లు, మురుగు కాలువ నిర్మాణాలు మాత్రం పూర్తయ్యాయి. మిగతా హామీలను అధికారులు పట్టించుకోలేదు. దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్నట్లు అయింది ఆ గ్రామస్థుల పరిస్థితి. పేరు గొప ్ప.. ఊరు దిబ్బ అనే సామెతకు ఈ గ్రామం ఓ నిదర్శంగా మారింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల నేటికీ సమస్యల మధ్య .. అభివృద్ధికి దూరంగా ఆ గ్రామం అలాగే ఉండిపోయింది. నాడు సీఎం ఇచ్చినా అమలు కాని హామీలను పరిశీలిస్తే..
ఆలయ అభివృద్ధి : నేమకల్లులో రాష్ట్రస్థాయిలో ప్రఖ్యాతి గాంచిన ఆంజనేయస్వామి ఆల యం ఉంది. ఆ ఆలయాన్ని సీజీఎఫ్ నిధులు రూ. మూడు కోట్లతో అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
బస్సు సౌకర్యం : ఇంత పేరు గాంచిన ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. దీంతో నేమకల్లు ఆంజనేయస్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బళ్లారి రోడ్డు వద్ద బస్సు దిగి.. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి ఆటోలల్లో.. ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని వస్తున్నారు. ఈ గ్రా మానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. ముఖ్యంగా బాలికలు విద్యకు దూరమయ్యారు.
గురుకుల పాఠశాల : ఈ గ్రామస్థుల అభ్యర్థన మేరకు నాడు సీఎం ఈ గ్రామంలో ఓ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇదీ అమలు కాలేదు.
అర్హులకు ఇళ్లు : అర్హులందరికీ తప్పకుండా ఇళ్లుమంజూరు చేయిస్తానని ముఖ్యమంత్రి నాడు హామీ ఇచ్చారు. ఏడాదిగా దీన్ని అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్ల మంజూరుకు అధికారులు హడావిడి చేస్తున్నారు.
యువతకు ఉపాధి : పలు పరిశ్రమలు ఏర్పాటు చేసి.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చినా.. వాటిని అమలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. శాఖ మధ్య సమన్వయ లోపం .. ఫైళ్ల కదలికలో నిర్లక్ష్యం .. బాధ్యతారాహిత్యం .. ఉన్నతాధికారుల చొరవ లేకపోవడం.. ఈ గ్రామానికి శాపాలుగా మారాయి. ఇప్పటికైనా కలెక్టర్ చొరవ చూపి.. గ్రామంలో సమస్యలు పరిష్కరించి.. అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.