Share News

వైద్యం షెడ్‌కు..!

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:38 AM

మండలంలోని రాయలచెరువులో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనాన్ని దాదాపు 25 సంవత్సరాల క్రితం నిర్మించారు.

వైద్యం షెడ్‌కు..!
రేకులషెడ్డులో నిర్వహిస్తున్న రాయలచెరువు ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం

యాడికి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని రాయలచెరువులో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనాన్ని దాదాపు 25 సంవత్సరాల క్రితం నిర్మించారు. దీంతో అది శిథిలావస్థకు చేరుకుంది. పై కప్పు పూర్తిగా దెబ్బతిని.. పెచ్చు లు ఊడిపడుతుండటంతో పదేళ్ల క్రితం ఆ కప్పు ను పూర్తిగా తొలగించి.. రేకులు వేశారు. నాటి నుంచి ఆ రేకుల షెడ్‌లోనే ఈ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం పరిధిలోకి రాయలచెరువు, కూర్మాజీపేట, రామరాజుపల్లి, తూట్రాళ్లపల్లి, కొత్తపల్లి, పచ్చారుమేకలపల్లి, నగరూరు, చందన, కేశవరాయునిపేట, లక్షుంపల్లి, దైవాలమడుగు తదితర గ్రామాలు వస్తాయి. ఈ గ్రామస్థులు వివిధ వైద్యసేవల కో సం రాయలచెరువు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంటారు. అయితే రేకుల షెడ్‌లో నిర్వహిస్తున్న ఈ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలూ లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు నాలుగేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.1.96 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణానికి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. అయితే నిధులు సక్రమంగా విడుదల చేయకపోవడంతో ఆ భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం రేకులషెడ్డులోనే ఆ వైద్యశాలను నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా స్పం దించి.. ఆ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:38 AM