విడపనకల్లు వెళ్లాలంటే.. టిక్కెట్ కొనాల్సిందే..
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:58 PM
మండలంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ యోగం దక్కట్లేదు. ఒక్క ఉచిత బస్సు సర్వీసు కూడా లేకపోవడమే ఇందుకు కారణం. కర్ణాటక సరిహద్దులో మండలం ఉండడమే ఇందుకు కారణం. మండలం మీదుగా బళ్లారి, అనంతపురం మధ్య రోజూ వంద బస్సులుపైగా తిరుగుతుంటాయి.
!స్త్రీ శక్తికి దూరంగా మండలం
ఒక్క ఉచిత బస్సు సర్వీసూ నడపని ఆర్టీసీ
మహిళలపై భారం
విడపనకల్లు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ యోగం దక్కట్లేదు. ఒక్క ఉచిత బస్సు సర్వీసు కూడా లేకపోవడమే ఇందుకు కారణం. కర్ణాటక సరిహద్దులో మండలం ఉండడమే ఇందుకు కారణం. మండలం మీదుగా బళ్లారి, అనంతపురం మధ్య రోజూ వంద బస్సులుపైగా తిరుగుతుంటాయి. అవన్నీ ఎక్స్‌ప్రె్‌సలు, అలా్ట్ర డీలక్స్ బస్సులే. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సులను ప్రకటించిన తరువాత ఈ బస్సులు అన్నింటికీ అంతర్రాష్ట్ర సర్వీసులుగా బోర్డులు తగిలించారు. దీంతో మండలంలోని మహిళలకు ఉచిత ప్రయాణ యోగం లేకుండా పోయింది. విడపనకల్లు నుంచి ఉరవకొండకు వెళ్లాలన్నా అంతర్రాష్ట్ర సర్వీసుల్లో టిక్కెట్ కొనాల్సిందే. అనంతపురం నుంచి విడపనకల్లు రావాలన్నా ఉరవకొండ వరకు మాత్రమే ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి విడపనకల్లుకు టిక్కెట్ కొనాల్సిందే. విడపనకల్లుకు ఒక్క పల్లె వెలుగు సర్వీసు కూడా లేదు. విడపనకల్లు వరకూ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని మండలానికి చెందిన మహిళలు కోరుతున్నారు.
విడపనకల్లుకు టిక్కెట్ తీసుకోవాల్సిందే
విడపనకల్లు మండలం కర్ణాటక సరిహద్దులో ఉండటంతో ఫ్రీ సర్వీసులు లేవు. ఉరవకొండ నుంచి విడపనకల్లు మీదుగా అన్ని బస్సులు బళ్లారికి వెళ్తుండటంతో అవి అంతర్రాష్ట్ర సర్వీసుల కిందకు వస్తాయి. వాటిలో ఉచిత ప్రయాణానికి అవకాశం లేదు. సరిహద్దు వరకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే చర్యలు తీసుకుంటాం.
-హంపయ్య, డిపో మేనేజర్, ఉరవకొండ