అక్రమాలపై విచారణ చేయాల్సిందే
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:09 AM
యాడికి గ్రామపంచాయతీలో గొర్రెల సంతను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించుకోవడం, గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ చేసి .. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాల్సిందేనని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.
యాడికి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): యాడికి గ్రామపంచాయతీలో గొర్రెల సంతను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించుకోవడం, గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ చేసి .. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాల్సిందేనని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఇటీవల వీరు అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎ్‌సలో ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ లక్ష్మేంద్ర ఫిర్యాదు చేసిన సీపీఐ నాయకులు వడ్డెరాముడు, గరిడి శివన్న, బండారు రాఘవను యాడికి గ్రామ పంచాయతీ కార్యాలయానికి పిలిపించారు. విచారణ పూర్తి అయిందంటూ ఎండార్స్‌మెంట్‌పై సంతకాలు చేయాలని ఆ నాయకులను జూనియర్ అసిస్టెంట్ కోరారు. దానికి వారు ససేమిరా అన్నారు. ఫిర్యాదుపై విచారణే చేపట్టలేదని, అవినీతిపరులపై చర్యలూ తీసుకోలేదని, దీంతో తాము సంతకాలు చేసే ప్రశక్తే లేదని తేల్చిచెప్పారు. ఇష్టానుసారంగా ఎండార్స్‌మెంట్ రాసుకొని సంతకం పెట్టమంటే ఎలా పెడతామని నిలదీశారు. ప్రైవేట్ వ్యక్తులు గ్రామపంచాయతీ ఆదాయాన్ని, నిధులను మింగేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేట్ వ్యక్తులు గొర్రెల సంతను ప్రైవేట్ స్థలంలో నిర్వహిస్తున్న గ్రామపంచాయతీ అధికారులు గానీ మార్కెట్‌యార్డు అధికారులు గానీ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిందేనని తెగేసి చెప్పారు. సమస్య పరిష్కారం కాకపోతే మరళా సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామన్నారు.