పొంచి ఉన్న ముప్పు
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:20 AM
ప్రస్తుత వానా కాలంలో అనేక రకాల విషపురుగులు, పాముల సంచారం పెరిగింది. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది.
కళ్యాణదుర్గం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వానా కాలంలో అనేక రకాల విషపురుగులు, పాముల సంచారం పెరిగింది. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది. కొన్ని రోజులుగా వ్యవసాయ పనులకు వెళ్లిన వారు పాముకాటుకు గురవుతున్నారు. ఈనేపథ్యంలో పొలం పనికి వెళితే ఏవైపు నుంచి ఎలాంటి పాము కాటుకు గురికావాల్సి వస్తుందోనని రైతులు, కూలీలు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మూడేళ్లుగా పరిశీలిస్తే 2023లో 95 మంది, 2024లో 110 మంది, 2025లో ఇప్పటిదాకా 128 మంది పాముకాటుకు గురైనట్లు వైద్య గణాంకాలు చెబుతున్నాయి. తక్షణ వైద్య సేవలు పొందడం ద్వారా ప్రాణపాయం నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటుకు యాంటీ వీనమ్ మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.
కాటేస్తే ఇలా చేయాలి: పాము, ఇతర ఏ విషపురుగు కాటు వేసినా వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించాలి. నాటు వైద్యం, మంత్రాలు, తంత్రాలు అంటూ కాలయాపణ చేయరాదు. కాటు వేసిన ప్రాంతాన్ని కాల్చరాదు. సబ్బుతో శుభ్రంగా కడగాలి. బాధితుడిని కంగారు పెట్టకుండా పడుకోబెట్టి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాటు వేసింది ఏ జాతి విషపురుగో తెలిస్తే అందుకు అనుగుణంగా విరుగుడు వైద్యం చేయడానికి వీలుంటుంది.