COLLECTER SYAM PRASAD: దివ్యాంగుల సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ
ABN , Publish Date - Dec 26 , 2025 | 11:34 PM
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం పీజీఆర్‌ఎస్ హాలులో ప్రత్యేక గ్రీవెన్సను నిర్వహించారు.
పుట్టపర్తి టౌన, డిసెంబర్ 26(ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం పీజీఆర్‌ఎస్ హాలులో ప్రత్యేక గ్రీవెన్సను నిర్వహించారు. డీఆర్‌ఓ సూర్యనారాయణరెడ్డితో కలిసి కలెక్టర్ దివ్యాంగుల నుంచి 156 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ దివ్యాంగుల వద్దకే స్వయంగా వెళ్లి, వారి సమస్యలను సావధానంగా ఆలకించి, అర్జీలను స్వీకరించారు. ఇందులో కొన్నింటిని అప్పటికప్పుడే పరిష్కరించారు. మరికొన్నింటిని తదుపరి చర్యల నిమిత్తం ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా విచారణ చేపట్టి, అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పెన్షన్లకు అధికంగా 137 అర్జీలు రాగా, వీల్‌చైర్లకు, ఇళ్లస్థలాలకు, ఉద్యోగాలకు రూ.15,000 ప్రత్యేక పెన్షనకు దివ్యాంగులు అర్జీలు ఇచ్చారు. చైర్మెన నారాయణస్వామి, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా సంచాలకురాలు అర్చన, స్కిల్ డెవల్‌పమెంట్ అధికారి హరికృష్ణ, ఎల్‌డీఎం రమణకుమార్, సమాచార శాఖ ఏడీ పురుషోత్తం, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, జిల్లా సచివాలయాల నోడల్ అధికారి సుధాకర్ పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్ ఆర్జీలపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు
ధర్మవరంరూరల్(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎస్ ఆర్జీలను పరిశీలించి సంబంధిత గ్రామ వీఆర్‌ఓ, సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను పరిష్కారించేదిశగా పనిచేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా పీజీఆర్‌ఎస్ దరఖాస్తుల రికార్డుబుక్‌ను పరిశీలించారు. ఎన్ని ఆర్జీలు వచ్చాయని అర్జీదారులతో మాట్లాడారా లేదా అని వీఆర్‌ఓలను అడిగారు. తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో వెళ్లి అర్జీదారులతో మాట్లాడి సమస్యలను పరిష్కారించాలన్నారు. వీటిపై ప్రతినెల రికార్డులను తనిఖీ చేయాలని ఆర్డీఓ మహే్‌షకు సూచించారు. భూసమస్యల సంబంధించిన అంశాలను పరిశీలించారు. దరఖాస్తుల పెండింగ్, సేవల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో ప్రజలకు అందించే సేవలపై జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ సురే్‌షబాబు, ఎంపీడీఓ సాయుమనోహర్, వీఆర్‌ఓలు, తదితర సిబ్బంది ఉన్నారు. అనంతరం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో జిల్లాకుసంబంధించిన ఈవీఎంల గోడౌనను రాజకీయపార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు.