Share News

IDEA :ఉపాధి మెరుగుపరచడమే ధ్యేయం

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:15 AM

దివ్యాంగుల జీవనోపాధులు మెరుగుపరచడమే ఐడియా(ఇనక్లూజివ్‌ దివ్యాంగ్జమ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌), సక్ష్యం స్వచ్ఛంద సంస్థల ధ్యేయమని ఐడియా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ పంకజ్‌ అన్నారు. ఢిల్లీ నుంచి అనంతకు వచ్చిన సంస్థ ప్రతినిధులు వారం రోజులుగా దివ్యాంగుల వివరాలను సేకరిస్తున్నారు.

IDEA :ఉపాధి మెరుగుపరచడమే ధ్యేయం
Pankaj, director of the Idea NGO, speaking

ఐడియా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ పంకజ్‌

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, మార్చి10(ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల జీవనోపాధులు మెరుగుపరచడమే ఐడియా(ఇనక్లూజివ్‌ దివ్యాంగ్జమ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌), సక్ష్యం స్వచ్ఛంద సంస్థల ధ్యేయమని ఐడియా స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ పంకజ్‌ అన్నారు. ఢిల్లీ నుంచి అనంతకు వచ్చిన సంస్థ ప్రతినిధులు వారం రోజులుగా దివ్యాంగుల వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి సోమవారం ఆ సంస్థ కార్యాల యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంకజ్‌ మాట్లాడుతూ.. ఐడియా సంస్థ చైర్మన ఐతా మల్లికార్జున అనంత జిల్లాలో విద్యనభ్యసించి ప్రొఫెసర్‌గా సేవలందించారన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీలో ఐడియా స్వచ్ఛంద సంస్థను స్థాపించి దివ్యాంగులకు సహాయసహకారాలు అందిస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలో ఉన్న దివ్యాంగులకు జీవనోపాధి కలిగించాలనే ఉద్దేశ్యంతో వడ్డీ రహిత రుణాలు (రీఫండబుల్‌ సీడ్‌ మనీ) అందించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. సర్వేలో భాగంగా ఉమ్మడి అనంత జిల్లా నుంచి దాదాపు 39 మంది దివ్యాంగులు రిజిస్ర్టేషన్లు చేసుకున్నారన్నారు. ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకూ కొవ్వూరునగర్‌లోని విద్యారణ్య స్కూల్‌లో శిక్షణ ఇస్తామన్నారు. 15వ తేదీ శిక్షణ పొందిన వారికి ఈడీపీ సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. అనంతరం 15 రోజుల్లోపు ఎంపికైన దివ్యాంగులందరికి ఒక్కొక్కరికి రూ.22500 రుణాన్ని వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సక్ష్యం స్వచ్ఛంద సంస్థ జిల్లా అధ్యక్షుడు సుంకు వేణుగోపాల్‌, ఐడియా ఈడీపీ ట్రైనర్‌ వీరం మురళీధర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 12:15 AM