MLA AMILINENI: సమాజానికి గురువులే ఆదర్శం
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:26 AM
గురువులు సమాజానికి ఆదర్శమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో గురువులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు.
కళ్యాణదుర్గం, సెప్టెంబరు5(ఆంధ్రజ్యోతి): గురువులు సమాజానికి ఆదర్శమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో గురువులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. శుక్రవారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. గురువులకు ఎమ్మెల్యే పాదాభివందనం చేశారు. అనంతరం 300 మందికి పైబడి గురువులను పూలమాలలు, దుశ్శాలువాలతో సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో గురువులు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. కనీసం ఒకటో తేదీ జీతాలు తీసుకునే పరిస్థితి లేదన్నారు. పీఆర్సీ అంటూ చర్చలకు పిలిచి వారిని నిలువునా మోసం చేశారని గుర్తు చేశారు. ఉపాధ్యాయులందరూ అడుగడుగునా వైసీపీ హయాంలో ఇబ్బందులు పడ్డారని వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామన్నారు. విద్యాశాఖమంత్రిగా ఉన్న నారాలోకేశ విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నారన్నారు. న్యాయబద్ధంగా ఉపాధ్యాయులకు అందాల్సిన పీఆర్సీ, డీఏలు తప్పకుండా అందుతాయన్నారు. బీటీపీ ప్రాజెక్టు కాలువ పనులు నిద్రపోయినా, లేచినా అదే గుర్తుకు వస్తోందన్నారు. పాత ధరకే ఈ ప్రాజెక్టు కాలువ పనులు చేస్తున్నామని, ఇటీవల సీఎం చంద్రబాబు కూడా మంచి నిర్ణయం తీసుకున్నావని అభినందించారని అన్నారు. ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.