St, Sc greevence ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్సకు వినతులు వెల్లువ
ABN , Publish Date - Apr 17 , 2025 | 10:50 PM
ఎస్సీ, ఎస్టీల గ్రీవెన్సకు వినతులు వెల్లువెత్తాయి. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో గురువారం ఈ గ్రీవెన్స నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది ఎస్సీ, ఎస్టీలు వివిధ సమస్యలపై తరలివచ్చారు.
అనంతపురం టౌన, ఏప్రిల్17 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీల గ్రీవెన్సకు వినతులు వెల్లువెత్తాయి. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో గురువారం ఈ గ్రీవెన్స నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది ఎస్సీ, ఎస్టీలు వివిధ సమస్యలపై తరలివచ్చారు. మొత్తం 238 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. కలెక్టరు వినోద్‌కుమార్, ఎస్పీ జగదీష్, డీఆర్‌ఓ మలోల, అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, డిప్యూటీ కలెక్టరు రామ్మోహన, ఆర్డీఓ కేశవనాయుడు, వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, సోషల్ వెల్ఫేర్ డీడీ రాధిక వినతులు స్వీకరించారు. కలెక్టరు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్సకు వచ్చిన ఫిర్యాదులపై నిర్లక్ష్యం చేయరాదన్నారు.
కలెక్టరు గైర్హాజరుపై నిరసన
ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స ప్రారంభం కాగానే బాధితులు వినతులు ఇవ్వడానికి వచ్చారు. అక్కడ కలెక్టరు లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ నాయకుడు సాకే హరి అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఇలాంటి గ్రీవెన్సకు కలెక్టరు రాలేనపుడు ఎందుకు పెట్టాలని బైఠాయించి నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న కలెక్టరు వినోద్‌కుమార్ వెంటనే గ్రీవెన్సకు వచ్చారు. సీఎస్ కాన్ఫరెన్స ఉండటంవల్ల రాలేకపోయానని, ఇకనుంచి తనతోపాటు అన్నిశాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ కమిషన వచ్చిన రోజు వేదికపైనే ఆనలైనలో పేకాట ఆడిన డీఆర్‌ఓపై ఏమి చర్యలు తీసుకున్నారని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ నాయకులు ప్రశ్నించారు. దీనిపై రెవెన్యూ కమిషన ఆఫీస్ ద్వారా తెలుసుకొని చెబుతానని కలెక్టరు చెప్పడంతో నిరసనకారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు.
అత్యాచార బాధితురాలికి సాయంపై వాగ్వాదం
జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ అత్యాచారానికి గురికాగా నిబంధనల మేరకు సాయం అందించడంలేదని బాధితురాలు, ఆమెతోపాటు వచ్చిన కొందరు డీఆర్‌ఓ మలోలతో వాగ్వాదానికి దిగారు. నిబంధనల మేరకు భూమి ఇవ్వాల్సి ఉందని ఏళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. దీనిపై వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని డీఆర్‌ఓ హామీ ఇవ్వగా శాంతించారు.