Satya Sai సంబరాల సందడి..!
ABN , Publish Date - Nov 18 , 2025 | 01:08 AM
సత్యసాయి శత జయంతి వేడుకలకు వచ్చే భక్తులతో పుట్టపర్తి అలరారుతోంది. మహా సమాధిని వేలాది మంది దర్శించుకుంటున్నారు. సాయికుల్వంతు సభా మంటపంలో సోమవారం పండిట్ విశ్వనాథ్ మోహన భట్ బృందం వీణావాయిద్యం భక్తులను అలరించింది.
పుట్టపర్తికి వేలాదిగా వస్తున్న భక్తులు
ప్రశాంతి నిలయంలో అలరించిన సంగీతం
నేడు రథోత్సవం.. భారీ వెండి రథం సిద్ధం
రేపు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు రాక
22, 23 తేదీల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన
భద్రతా వలయంలో పుట్టపర్తి.. పరిసర ప్రాంతాలు
పుట్టపర్తి, టౌన, రూరల్, నవంబరు17(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంతి వేడుకలకు వచ్చే భక్తులతో పుట్టపర్తి అలరారుతోంది. మహా సమాధిని వేలాది మంది దర్శించుకుంటున్నారు. సాయికుల్వంతు సభా మంటపంలో సోమవారం పండిట్ విశ్వనాథ్ మోహన భట్ బృందం వీణావాయిద్యం భక్తులను అలరించింది. చిత్రావతి నదిలో లేజర్ షో ఆకట్టుకుంటోంది. ఇనచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, బీజేపీ నాయకులు విష్ణువర్ధనరెడ్డి లేజర్ షోను వీక్షించారు. చిత్రావతినది తీరం భక్తులతో కిటకిటలాడింది. మరోవైపు మంగళవారం నిర్వహించే సత్యసాయి రథోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా 30 అడుగుల ఎత్తైన వెండిరథాన్ని సిద్ధంచేశారు. రథోత్సవం తిలకించడానికి వేలాది మంది భక్తులు ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు.
రేపు ప్రధాని.. 22న రాష్ట్రపతి రాక
శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు బుధవారం పుట్టపర్తికి వస్తున్నారు. ప్రధాని బుధవారం ఉదయం సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని, హిల్ వ్యూ స్టేడియంలో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు. ప్రధాని పర్యటనకు భద్రతను పటిష్టం చేశారు. సత్యసాయి విమానాశ్రయం నుంచి ప్రశాంతి నిలయం, హిల్‌వ్యూ స్టేడియం దాకా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 22న రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సీఎం, పలురాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు వస్తున్నారు. వీరి కోసం విమానాశ్రయంతోపాటు నాలుగు చోట్ల హెలీప్యాడ్‌లు ఏర్పాటు చేశారు. కాన్వాయ్ వెళ్లే మార్గంలో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. భక్తుల కోసం హిల్ వ్యూ స్టేడియం సభావేదికకు ఇరువైపులా ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నారు.
అదనపు డీజీ సమీక్ష
జాతీయ స్థాయి వీవీఐపీల పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఏపీ లా ఆండ్ ఆర్డర్ అదనపు డీజీ మధుసూదనరెడ్డి ఆదేశించారు. ఈ నెల 19న ప్రధాని, 22, 23న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు వీవీఐపీలు, వీఐపీలు పుట్టపర్తికి వస్తున్నారు. దీంతో డీపీఓ సమీపంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఐజీ శ్రీకాంత, డీఐజీలు షిమోషి, ఫక్కీరప్ప, అన్బురాజన, సత్యయేసుబాబు, ఎస్పీలు సతీ్‌షకుమార్, జగదీష్, పరమేశ్వర్ రెడ్డి, రాధిక, దీపికా పాటిల్, కృష్ణకాంత పటేల్, రాణా, సునీల్ టైనీ తదితర ఉన్నతాధికారులతో ఆయన భద్రతపై సమీక్ష నిర్వహించారు. వీవీఐపీల షెడ్యూల్, మినిట్ టు మినిట్ రూట్ మ్యాప్, భద్రత గురించి డీఐజీ షిమోషి, ఎస్పీ వివరించారు. వేడుకలు, ప్రముఖుల పర్యటనలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అదనపు డీజీ ఆదేశించారు. స్డేడియం, సాయికుల్వంతు హాలు వెలుపల ప్రతి ఒక్కరినీ తనిఖీ చేయాలని ఆదేశించారు. భక్తులతో మర్యాదగా నడుచుకోవాలని, సూచించారు. ఏ చిన్న సమస్య వచ్చినా కంట్రోల్ రూంకు సమాచారం అందచేయాలని సూచించారు.
నేడు డీఎంఈ రాక
అనంతపురం వైద్యం(ఆంధ్రజ్యోతి): సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకుని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన(డీఎంఈ) డాక్టర్ రఘునందన మంగళవారం పుట్టపర్తి రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఇతర ప్రముఖులు బుధవారం సత్యసాయి జయంతి వేడుకలకు రానున్న తరుణంలో ప్రత్యేక అత్యవసర వైద్యసేవల కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ వైద్యవిద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్, ఫోరెన్సిక్ హెచఓడీ ప్రొఫెసర్ ఆర్.శంకర్ లైజనింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే కళాశాల నుంచి వివిధ విభాగాల స్పెషల్ డాక్టర్లకు డ్యూటీలు కేటాయించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి 23వరకు ప్రత్యేక అత్యవసర కేంద్ర సేవలు కొనసాగనున్నాయి. కాగా డీఎంఈ రఘునందనతోపాటు అడిషనల్ డీఎంఈ డాక్టర్ వెంకటేశ్వర్లు, స్టేట్ నోడల్ ఆఫీసర్ అనురాధ తదితరులు వేడుకలకు రానున్నట్లు లైజనింగ్ ఆఫీసర్ డాక్టర్ శంకర్ పేర్కొన్నారు.
వేడుకలు విశ్వవ్యాప్తం: రత్నాకర్
సత్యసాయి శత జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి తరలివచ్చిన భక్తులతో పుట్టపర్తిలో కోలాహలం నెలకొందని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ అన్నారు. సత్యసాయి ప్రేమ, సందేశాలు విశ్వ వ్యాప్తంగా ప్రతిఽధ్వనిస్తున్నాయని అన్నారు. ప్రశాంతి నిలయం రేడియో సాయి వద్ద అఖిలభారత సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు నిమీష్ పాండేతో కలిసి సోమవారం మీడియాతో మాట్లాడారు. వేడుకలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహకారం, ఏర్పాట్ల గురించి వివరించారు. సెంట్రల్ ట్రస్ట్, సేవాసంస్థలు, సిబ్బంది, సాయి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, కార్యకర్తల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. శత జయంతి ఉత్సవాలకు ఏడాది కాలంగా రూపకల్పన చేశామని, దేశవిదేశీ భక్తులు 220కిపైగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు వసతి, భోజనం, దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. రైల్వే స్టేషన నుంచి ప్రశాంతి నిలయం వరకూ దారులన్నీ విద్యుత కాంతులు పరుచుకున్నాయని తెలిపారు. సాయి భక్తులు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు.
సీఎం చంద్రబాబు చొరవ..
రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయి శత జయంతి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రభుత్వం, ట్రస్టు కలిసి ఘనంగా వేడుకలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబానాయుడు ప్రత్యేక చొరవ చూపించారని, అధికార యంత్రాంగాన్ని దించి పని చేయిస్తున్నారని అన్నారు. కేద్రం ప్రభుత్వం 160 ప్రత్యేక రైళ్లు వేసిందని అన్నారు. ఈ నెల 19న ప్రధాని చేతుల మీదుగా సత్యసాయి శత జయంతి స్మారక చిహ్నాంగా వంద రూపాయల నాణెం, నాలుగు తపాల స్టాంపులను ఆవిష్కరిస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో జిల్లాలో వంద మంది రైతులకు పాడి ఆవులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఏటా 18న జరిగే వేణుగోపాలస్వామి రథోత్సవాన్ని సత్యసాయి రథోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సత్యసాయి శత జయంతి వేడుకలు భక్తులకే కాదని, సమస్త సృష్టి కోసం, మనుషులు, జంతువులు, ప్రకృతి, చెట్లు, పక్షులు అన్నింటికీ పరమ పవిత్రమైన పండుగ అని నిమీష్ పాండే అన్నారు.
నేడు పుట్టపర్తికి గవర్నర్
ఉత్సవాల్లో పాల్గొననున్న డీసీఎం, మంత్రి లోకేశ
పుట్టపర్తి(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్, మంత్రి నారాలోకేశ మంగళవారం పుట్టపర్తికి రానున్నారు. గవర్నర్ అబుల్ నజీర్ విజయవాడలో సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో బయల్దేరి 5.20 గంటలకు సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రికి శ్రీనివాస అథితి గృహంలో బస చేస్తారు. బుధవారం ఉదయం 9.45కి ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి సత్యసాయి విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. అనంతరం సాయికుల్వంత హాలులో సత్యసాయి మహా సమాధిని దర్శించుకుంటారు. తర్వాత 10.30 హిల్‌వ్యూ స్టేడియంలో ప్రధానితోపాటు సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం తిరుపతికి వెళ్తారు. డిప్యూటీ సీఎం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రికి ప్రశాంతి నిలయంలోని శ్రీనివాస అఽథితి గృహంలో విడిది చేస్తారు. ఐటీ శాఖ మంత్రి నారాలోకేశ మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో 3.40గంటలకు ప్రత్యేక హెలీకాప్టర్‌లో బయల్దేరి పుట్టపర్తి విమానాశ్రయానికి 5.10కి చేరుకుంటారు. పుట్టపర్తిలో కప్పలబండ ఏపీఐఐసీ పార్కులో ఏర్పాటు చేసిన ప్రత్యేక విడిది కేంద్రంలో బసచేస్తారు. బుధవారం పుట్టపర్తి విమానాశ్రానికి చేరుకుంటారు. ప్రధాన మంత్రిని స్వాగతం పలుకుతారు. పది గంటలకు సాయికుల్వంత హాలోలో సత్యసాయిబాబా మహాసమాధిని దర్శించుకుంటారు. 10.30 హిల్‌వ్యూ స్టేడియంలో నిర్వహించే సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 1 గంటకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని వెళ్తారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎనవీ రమణ మధ్యాహ్నం 12.45కి బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పుట్టపర్తి చేరుకుని రాత్రికి పుట్టపర్తిలో బసచేస్తారు.