Share News

గ్రామీణ రహదారులు ఛిద్రం

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:08 AM

మండలంలో గ్రామీణ రహదారులు ఘోరంగా తయారయ్యాయి. తొండపాడు నుంచి గొందిపల్లికి వెళ్లే రోడ్డు చిన్నపాటి వనోస్తే చాలు.. మొత్తం బురదమయంగా మారుతోంది.

గ్రామీణ రహదారులు ఛిద్రం
బురదమయమైన తొండపాడు - గొందిపల్లి రోడ్డు

గుత్తిరూరల్‌, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): మండలంలో గ్రామీణ రహదారులు ఘోరంగా తయారయ్యాయి. తొండపాడు నుంచి గొందిపల్లికి వెళ్లే రోడ్డు చిన్నపాటి వనోస్తే చాలు.. మొత్తం బురదమయంగా మారుతోంది. పది రోజుల నుంచి వర్షం పడుతుండంతో ప్రస్తుతం మరీ ఘోరంగా తయారైంది. తొండపాడు నుంచి గొందిపల్లికి 2019లో బీటీ రోడ్డు వేసినా... మధ్యలో ఒక కిలో మీటరు మేరకు మట్టి రోడ్డుని అలాగే వదిలేశారు. ఈ దారి గుండా గొందిపల్లికి, నంద్యాల జిల్లా మామిళ్ళపల్లి, రాంపురం, జక్కసానికుంట్ల, పీఆర్‌ పల్లికి ద్విచక్రవాహనాలు, ఆటోలు వెళ్తుంటాయి. వర్షం వచ్చింది అంటే చాలు ఈ దారి బురదమైమయి వాహనాలు ఇరుక్కుపోతుంటాయి. ద్విచక్రవాహనదారులు జారి పడటంతో అనేక మంది గాయపడ్డారు. రాత్రి వేళల్లో ఈ రోడ్డుపై వెళ్లడానికి గ్రామస్థులు జంకుతున్నారు. అలాగే ధర్మాపురం రోడ్డు కూడా వర్షలకు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డు అంత గుంతలు ఏర్పడి వర్షపు నీటితో నిండి పోయి ఉండటంతో.. ఎక్కడ గుంత ఉండేది తెలియక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలుకు వెళ్లే 44వ జాతీయ రహదారి నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ధర్మాపురం గ్రామం ఉంది. 15 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి వేసిన బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతిని.. కంకర తేలి.. గుంతలు పడ్డాయి. పాలకులు, అధికారులు స్పందించి ఈ రోడ్లను బాగు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Aug 19 , 2025 | 12:08 AM