స్మార్ట్ కార్డుల పేరుతో హంగామా
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:04 AM
రేషనకార్డు దారుల ఇంటి వద్దకే వెళ్లి.. స్మార్ట్ రేషన కార్డులు పంపిణీ చేయాలని పాలకులు, అధికారులు స్పష్టమైన ఆదేశాలున్నాయి.
బొమ్మనహాళ్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): రేషనకార్డు దారుల ఇంటి వద్దకే వెళ్లి.. స్మార్ట్ రేషన కార్డులు పంపిణీ చేయాలని పాలకులు, అధికారులు స్పష్టమైన ఆదేశాలున్నాయి. అయినా సచివాలయ సిబ్బంది, రేషన షాప్ డీలర్లు, సివిల్ సప్లై అధికారులు ఆ ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మండలంలో అధికారులు, స్థానిక నాయకులు నానా హంగామా చేస్తూ.. గ్రామాల్లో ఒకే చోట లబ్ధిదారులను పిలిపించి గందరగోళం మధ్య స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్డులు పంపిణీ సమయంలో లబ్దిదారుల మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. నెట్‌వర్క్ పనిచేయకపోవడంతో.. గంటల తరబడి.. వేచి ఉండాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. కాగా.. ఈ కార్డులు కొన్ని సచివాలయ సిబ్బంది వద్ద.. మరికొన్ని రేషన డీలర్ల వద్ద ఉన్నాయి. దీంతో తమ కార్డు ఎవరి వద్ద ఉందో తెలీక లబ్ధిదారులు తికమకపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి స్మార్ట్ రేషన కార్డులను ఇంటివద్దనే అందించేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. దీనిపై బొమ్మనహాళ్ ఇనచార్జి సీఎ్‌సడీటీను వివరణ కోసం సంప్రదించగా అందుబాటులో లేరు.