Share News

Kharif ఖరీఫ్‌ సాగుకు సమాయత్తం

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:45 AM

ఖరీఫ్‌ సీజనలో పంటలు సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. సకాలంలో వర్షాలు కురుస్తుండటంతో పొలాలను దుక్కులు దున్ని విత్తనం చేయడానికి సిద్ధం చేశారు.

Kharif     ఖరీఫ్‌ సాగుకు సమాయత్తం
కూడేరులో విత్తనాలను సిద్ధం చేస్తున్న మహిళలు

కూడేరు జూన 16(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజనలో పంటలు సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. సకాలంలో వర్షాలు కురుస్తుండటంతో పొలాలను దుక్కులు దున్ని విత్తనం చేయడానికి సిద్ధం చేశారు. కూడేరు మండలంలో దాదాపు 15వేల హెక్టార్లులో వేరుశనగ, కంది, ఆముదం, జొన్న తదితరు పంటలు సాగు చేయడానికి అన్నదాతలు అవసరమైన విత్తనాలను నిల్వ చేసుకున్నారు. గత ఏడాది వర్షాలు సకాలంలో కురవకపోవడతో వేరుశనగ సాగు తగ్గింది. మూడు సంవత్సరాలుగా అన్నదాతలు వేరుశనగ పంట సాగు తగ్గించి కంది, ఆముదం తదితర అంతర్‌పంటల వైపు మొగ్గుచూపారు. ఈ ఏడాది వేరుశనగ పంటకు మార్కెట్‌లో ధర అధికంగా పలుకుతుండటంతో అన్నదాతలు వేరుశనగ పంట సాగు మొగ్గు చూపుతున్నారు. మండలంలో 8520 హెక్టార్లులో వేరుశనగ, 1962 హెక్టార్లలో కంది, 2234 హెక్టార్లలో ఆముదం పంటతోపాటు మరో రెండు వేల హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పెరస, తదితర పంటలు సాగుకు సిద్ధంగా ఉన్నారని వ్యవసాయశాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో సబ్సిడీ విత్తన కాయలు సరఫరా చేశారు. దీంతో అన్నదాతలు కాయల నుంచి విత్తనాలను వేరుచేసే పనిలో బిజీగా ఉన్నారు. మరోపక్క పొలాల్లో కంది, ఆముదం కొయ్యలను తొలగించి శుభ్రం చేశారు. వర్షం కురిస్తే.. విత్తనం వేయడానికి అవసరమైన ఏర్పాట్లులో అన్నదాతలు నిమగ్నమయ్యారు.

Updated Date - Jun 17 , 2025 | 12:45 AM