పంటలు వర్షార్పణం
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:06 AM
నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న పంట దిగుబడి తడిసి రంగు మారి.. మొలకలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
యాడికి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న పంట దిగుబడి తడిసి రంగు మారి.. మొలకలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రూ. లక్షల నష్టాన్ని నష్టపోయామని వాపోయారు. యాడికి మండలం వేములపాడు గ్రామానికి చెందిన నాగశేషుడు, హాజి, కొట్టాలపల్లి గ్రామానికి చెందిన జగదీష్ తదితర రైతులు మొక్కజొన్న సాగుచేశారు. పంటకోతకు రావడంతో పొలంలో కోసిన దిగుబడిని తీసుకువచ్చి స్థానిక జాతీయ రహదారి పక్కన ఆరబెట్టారు. పంట దిగుబడి విక్రయానికి సిద్ధంగా ఉన్న సమయంలో నాలుగు రోజుల నుంచి వరుసగా కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్నలు మొత్తం తడిచి నల్ల రంగులోకి మారాయి. ధాన్యం మొత్తం మొలకలు వచ్చాయి. వ్యాపారులు ఎవరూ కొనరని పంటను రైతులు రోడ్డుపైనే వదిలేసి వెళ్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
దెబ్బతిన్న వేరుశనగ పంట
కుందుర్పి : మండలంలోని రుద్రంపల్లికి చెందిన వెంకటేష్ ఏడు ఎకరాలలో సాగు చేసిన వేరుశనగ పంటను తొలగించారు. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వర్షానికి తడిసి వేరుశనగ పంట దెబ్బతింది. వేరుశనగ పంట రంగు మారి.. మొలకలు వచ్చాయి. మండలంలోని అనేక మంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది.