rain: ముంచిన వాన
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:28 AM
పట్టణంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మగ్గం గుంతల్లోకి నీరింది. దీంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని వైఎ్‌సఆర్, ఇందిరమ్మ, కేతిరెడ్డి కాలనీలలో 30 మగ్గాల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది.
ధర్మవరంలో భారీ వర్షం
మగ్గం గుంతల్లోకి చేరిన వర్షపు నీరు
తెల్లవార్లు జాగరణ చేసిన నేతన్నలు
భృతి ఇవ్వాలంటున్న చేనేత కార్మికులు
ధర్మవరం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మగ్గం గుంతల్లోకి నీరింది. దీంతో చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని వైఎ్‌సఆర్, ఇందిరమ్మ, కేతిరెడ్డి కాలనీలలో 30 మగ్గాల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో మగ్గాల గుంతలన్నీ నిండటంతోపాటు నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు తడిసిపోయాయి. చేనేత కార్మికులు మగ్గం గుంతల్లో, ఇళ్లలోకి చేరిన నీటిని తెల్లవార్లు తోడేశారు. చేనేత కార్మికులు మాట్లాడుతూ.. డ్రైనేజీలు నిర్మించకపోవడం, ఇంటి ఎదుట రోడ్లు ఎత్తుగా ఉండటంతో వాన నీరంతా ఇళ్లకి వచ్చినట్లు తెలిపారు. తెల్లవార్లు ఈ నీటిని ఎత్తిపోస్తూ జాగారం చేసినట్లు పలువురు బాధితులు తెలిపారు. మగ్గాలన్నీ తడిసిపోవడంతో నెలరోజులపాటు ఉపాధిని కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు.
టీడీపీ హయాంలో వర్షాకాలంలో వర్షాకాలపు భృతి ఇచ్చారని, ఆ దిశగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మూడునెలలపాటు వర్షాకాలపు భృతి ఇవ్వాలని కోరారు.
పరిశీలించిన కమిషనర్, టీడీపీ నాయకులు
పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో వర్షాలకు నష్టపోయిన కుటుంబాలను మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, టీడీపీ నాయకులు శనివారం పరిశీలించారు. తడిసిపోయిన మగ్గం గుంతలు, ఆహారధాన్యాలు, ఇతర సామగ్రిని పరిశీలించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్, పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి పురుషోత్తంగౌడ్, నాయకులు బొట్టు కిష్ట పాల్గొన్నారు.
పొంగిన వాగులు, వంకలు
ధర్మవరంరూరల్: ఉరుములు, మెరుపులతో కూడి వర్షం కురవడంతో మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మండలవ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. ధర్మవరంలో 52..06మిమీ వర్షపాత నమోదైనట్లు ఏఎ్‌సఓ శర్మ తెలిపారు. మండలంలోని గొట్లూరు గ్రామంలో ఇళ్ల మధ్యన భారీగా వర్షపునీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పదేళ్లుగా వర్షం వచ్చినపుడల్లా ఇబ్బంది పడుతున్నట్లు వారు పేర్కొన్నారు.