Share News

RAINS: పంటలకు వాన దెబ్బ

ABN , Publish Date - Aug 14 , 2025 | 12:14 AM

డతెరిపి లేని వానలు ఉమ్మడి జిల్లాలో పంటలను దెబ్బతీస్తున్నాయి. బోరుబావుల కింద చేతికొచ్చిన వేరుశనగ పంటను పలు ప్రాంతాల్లో రైతులు తొలగించారు. ఆ వెంటనే వర్షాలు ప్రారంభం కావడంతో కట్టె తడిసిపోయి నల్లగా మారి, పశుగ్రాసానికి పనికిరాకుండా పోతోంది. కాయలకు మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

RAINS: పంటలకు వాన దెబ్బ
Affected farmers showing their rotted crop

(న్యూస్‌ నెట్‌వర్క్‌, ఆంధ్రజ్యోతి)

ఎడతెరిపి లేని వానలు ఉమ్మడి జిల్లాలో పంటలను దెబ్బతీస్తున్నాయి. బోరుబావుల కింద చేతికొచ్చిన వేరుశనగ పంటను పలు ప్రాంతాల్లో రైతులు తొలగించారు. ఆ వెంటనే వర్షాలు ప్రారంభం కావడంతో కట్టె తడిసిపోయి నల్లగా మారి, పశుగ్రాసానికి పనికిరాకుండా పోతోంది. కాయలకు మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. చాలా ప్రాంతాల్లో పొలాల్లో నీరు నిలిచి పంట దెబ్బతింటోంది. జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో మంగళవారం వర్షం కురిసింది. అత్యధికంగా పెద్దపప్పూరు మండలంలో 2.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గుంతకల్లు 2.0, కళ్యాణదుర్గం 1.3, బెళుగుప్ప మండలంలో 1.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో ఒక సెంటీ మీటరు లోపు నమోదైంది. జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం వర్షం కొనసాగింది. శ్రీసత్యసాయి జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. గుడిబండ మండలంలో అత్యధికంగా మంగళవారం 1.96 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హిందూపురం 1.7, గోరంట్ల 1.6, చిలమత్తూరు 1.26, రొళ్ల 1.14, మడకశిర 1.04 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో ఒక సెంటీమీటరు లోపు వర్షాలు కురిశాయి. అనంతపురం, యాడికి, పుట్లూరు తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి.


నీట మునిగిన వేరుశనగ పంట

కణేకల్లు మండల పరిధిలోని గరుడచేడు వద్ద వేదవతి నది పరీవాహకంలోని 200 ఎకరాల్లో వేరుశనగ పంట నీటమునిగింది. నాగేపల్లి, తుంబిగనూరు గ్రామాల పొలాల్లోని వంక నీరు వేదవతి నదిలోకి వెళ్లకుండా గరుడచేడు గ్రామంలోని వేరుశనగ పంట పొలాల్లోకి చేరుతోంది. దీంతో పంటలు దెబ్బతింటున్నాయి. సుమారు 50 మంది రైతులకు చెందిన 200 ఎకరాల్లోకి వరద నీరు చేరింది. మరో 20 రోజుల్లో చేతికొచ్చే వేరుశనగ పంట దెబ్బతింటోంది. తమకు ఇప్పటికే రూ.30 లక్షలకుపైగా నష్టం జరిగిందని బాధిత రైతులు వాపోతున్నారు. బొమ్మనహాళ్‌ మండలం దేవగిరి క్రాస్‌లో కౌలు రైతు పరమేష్‌ ఆరు రోజుల క్రితం ఆరు ఎకరాల్లో వేరుశనగ పంటను కోశాడు. మరుసటి రోజు నుంచి వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పొలంలోనే కుప్పలుగా వేసిన వేరుశనగ కట్టె తడిసి బూజుపట్టింది. రూ.5 లక్షలదాకా నష్టం జరిగిందని బాధిత రైతు వాపోయాడు. స్థానిక టీడీపీ నాయకులు మల్లీడు శ్రీనివాసులు, రేవణ్ణ, సాల్లాపురం బాబు పంటను పరిశీలించారు. ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లి బాధితుడిని ఆదుకుంటామని తెలిపారు. నల్లచెరువు నూరుద్దీన కాలనీలో సుబహాన అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Updated Date - Aug 14 , 2025 | 12:14 AM