PROJECTS: ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలి
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:21 AM
రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రైతు సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ‘రాయలసీమ ప్రాజెక్టులు-పరిష్కార మార్గాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
అనంతపురం టౌన/క్లాక్‌టవర్, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రైతు సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ‘రాయలసీమ ప్రాజెక్టులు-పరిష్కార మార్గాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాయలసీమలో హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభించి 37 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ పూర్తి చేయకపోవడం ముమ్మాటికీ పాలకవర్గాల నిర్లక్ష్యమేనని విమర్శించారు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి, రాయలసీమలో 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించి ఉండుంటే రాయలసీమ సస్యశ్యామలం అయ్యేదన్నారు. రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటోందన్నారు. వర్షాలు కురవక, చెరువులు నిండక, భూగర్భజలాలు అడుగంటి వ్యవసాయం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కరువులతో వలసలు, రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4లక్షల మందికిపైగా రైతు కూలీలు వలస వెళ్లారన్నారు. 20 ఏళ్లలో ఉమ్మడి జిల్లాలో 3 వేల మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, ఏడాదిలోనే 80 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ఈ సంక్షోభం నుంచి జిల్లా ప్రజలు బయట పడాలంటే హంద్రీనీవా ప్రాజెక్టు ఒక్కటే శరణ్యమన్నారు. 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాల్సి ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో 1400 చెరువులు ఉండగా.. 100 మాత్రమే నింపుతున్నారన్నారు. వెయ్యి చెరువులకు నీరిస్తామని ప్రభుత్వాలు ప్రకటించినా ఆ ప్రయోజనం నెరవేరే అవకాశం లేకుండా పోయిందన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జల సాధన సమితి అధ్యక్షుడు రామ్‌కుమార్, ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, రచయిత అప్పిరెడ్డి హరినాథరెడ్డి, రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, రైతు సంక్షేమ సంఘం నాయకులు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రకాష్, రామకృష్ణారెడ్డి, శేషాద్రిరెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు.