Share News

PGRS పంచాయితీ చేస్తాం.. రూ.10లక్షలు ఇవ్వండి..

ABN , Publish Date - Nov 18 , 2025 | 01:04 AM

దంపతుల మధ్య సమస్య పరిష్కరించడానికి కులపెద్దలు పంచాయితీ చేస్తారట. అందుకు ఏకంగా రూ.10లక్షలు, పది తులాల బంగారం ఇవ్వాలని తీర్మాణం చేశారు. ఈ ఘటన గుంతకల్లులో వెలుగుచూసింది. బాధితురాలు తన సమస్యను చెప్పుకోవడానికి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చింది.

PGRS పంచాయితీ చేస్తాం.. రూ.10లక్షలు ఇవ్వండి..
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ఆనంద్‌

ఒప్పుకోకపోవడంతో వేధింపులు

కలెక్టర్‌కు విన్నవించుకున్న బాధితురాలు

అనంతపురం కలెక్టరేట్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): దంపతుల మధ్య సమస్య పరిష్కరించడానికి కులపెద్దలు పంచాయితీ చేస్తారట. అందుకు ఏకంగా రూ.10లక్షలు, పది తులాల బంగారం ఇవ్వాలని తీర్మాణం చేశారు. ఈ ఘటన గుంతకల్లులో వెలుగుచూసింది. బాధితురాలు తన సమస్యను చెప్పుకోవడానికి సోమవారం కలెక్టరేట్‌కు వచ్చింది. ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. గుంతకల్లుకు చెందిన మోతి కుళ్లాయమ్మ మీడియాకు సమస్య వివరించింది. గుంతకల్లు పట్టణంలోని కథలవీధికి చెందిన కుళ్లాయమ్మకు అదే కాలనీకి చెందిన మోతి రమే్‌షతో 17 ఏళ్ల క్రితం వివాహమైంది. నలుగురు పిల్లలున్నారు. రమేష్‌ కొంతకాలంగా వ్యసనాలకు బానిసై తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని కుళ్లాయమ్మ ఆరోపించింది. ఈ విషయంలో బుక్కరాయసముద్రానికి చెందిన పూజారి కుళ్లాయప్ప.. రమే్‌షకు మద్దతిచ్చాడు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేస్తామని చెప్పాడు. అందుకు రూ.2లక్షల డబ్బు, 10తులాల బంగారం ఇవ్వాలని చెప్పారు. అందుకు కుళ్లాయమ్మ ఒప్పుకోలేదు. దీంతో ఆమెను వదిలేసి భర్త రమేష్‌.. పిల్లలను తీసుకుని వెళ్లిపోయాడు. సమస్యను పెద్ద మనుషులు పెద్దపుల్లన్న, మోతి ఆంజనేయులు, సంకుల ఆంజనేయులు, గడ్డం రామలింగ, డొక్కా వీరన్నకు కుళ్లాయమ్మ చెప్పుకుంది. దీంతో దంపతులను కలపడానికి పంచాయితీ చేస్తామనీ, అందుకు రూ.10లక్షలు, పది తులాల బంగారం ఇవ్వాలని పెద్దమనుషులు చెప్పారని తెలిపింది. డబ్బు ఎందుకివ్వాలని ప్రశ్నించినందుకు తమను కులం నుంచి వెలివేస్తున్నామని చెప్పారని బాధితురాలు వాపోయింది. తనను ఇల్లు ఖాళీ చేసి, తండ్రి వద్ద ఉండేలా తీర్మానం చేశారన్నారు. కుల పెద్దలతోపాటు భర్త రమేష్‌, పూజారి కుళ్లాయప్పపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరింది.

రైతులను ఆదుకోవాలి

అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని వైసీపీ నాయకులు అధికారులను కోరారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మారుతీనాయుడు, మైనార్టీ విభాగ జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్‌, ఎస్పీ విభాగ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసనాయక్‌ తదితరులు.. అధికారులకు వినతిపత్రం అందజేశారు. పుట్లూరు, యల్లనూరు, తాడిపత్రి, పెద్దవడుగూరు తదితర మండలాల్లో గత మార్చి, ఏప్రిల్‌ నెలల్లో తుఫాన, గాలివానకు అరటి, మొక్కజొన్న, దానిమ్మ తదితర పంటలు దెబ్బతిన్నాయన్నారు. దీంతో రైతులు నష్టపోయి, అప్పులపాలయ్యారన్నారు. అప్పటి కలెక్టర్‌ మొత్తం రూ.47.47కోట్లు నష్టం జరిగినట్లు ప్రభుత్వానికి నివేదికలు పంపారన్నారు. ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు.

Updated Date - Nov 18 , 2025 | 01:04 AM