Pattabhiram జనవరికి చెత్తను ఖాళీ చేయాలి
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:50 AM
డంపింగ్ యార్డులో చెత్తను జనవరి చివరినాటికి ఖాళీ చేయాలని, లేదంటే ఏజెన్సీ మార్చేందుకు వెనుకాడబోమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన చైర్మన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బయోమైనింగ్ చేస్తున్న సంస్థను హెచ్చరించారు.
లేదంటే ఏజెన్సీని మార్చేందుకు వెనుకాడం
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన చైర్మన పట్టాభిరామ్
ఎమ్మెల్యే దగ్గుపాటితో కలిసి డంప్‌యార్డు పరిశీలన
అనంతపురం క్లాక్‌టవర్, డిసెంబరు12(ఆంధ్రజ్యోతి): డంపింగ్ యార్డులో చెత్తను జనవరి చివరినాటికి ఖాళీ చేయాలని, లేదంటే ఏజెన్సీ మార్చేందుకు వెనుకాడబోమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన చైర్మన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బయోమైనింగ్ చేస్తున్న సంస్థను హెచ్చరించారు. అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన డైరెక్టర్ భవాని రవికుమార్‌తో శుక్రవారం గుత్తి రోడ్డులోని డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు. బయోమైనింగ్ పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిగ్మ సంస్థ బయోమైనింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తోందని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. పనితీరును మార్చుకుని, చెత్త ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయాలని సూచించారు. డంపింగ్ యార్డులో 5 లక్షల టన్నుల చెత్త ఉంటే.. 3.3 లక్షల టన్నులు ఒక విడత, 1.7 లక్షల టన్నుల మరో విడత బయోమైనింగ్ చేయాలని నిర్దేశించామని అన్నారు. సంక్రాంతి నాటికి ప్రాసెస్ పూర్తి చేసి, జనవరి చివరికి తరలింపును పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తరువాత ఖాళీ అయిన డంపింగ్ యార్డు స్థలంలో గ్రీన పార్కు ఏర్పాటు చేసి, నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని తెలిపారు.
చెత్త సేకరణకు ఎలకి్ట్రక్ వాహనాలు
నగరపాలక సంస్థకు 62 ఎలకి్ట్రక్ వాహనాలను అందజేస్తామని, వాటినికి ఇంటింటా చెత్త సేకరణకు ఉపయోగించాలని పట్టాభి సూచించారు. నగరంలో పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటుకు నిధులిస్తామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డంపింగ్ యార్డులో బయోమైనింగ్‌కు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చొరవ చూపడం అభినందనీయమని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతి, అక్రమాలు విజిలెన్స విచారణతో బహిర్గతమౌతాయని అన్నారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి అసహనం
డంపింగ్ యార్డులో పనుల పట్ల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే దగ్గుపాటి అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా డంపింగ్ యార్డు సమీప ప్రాంత ప్రజలు, నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక డంపింగ్ యార్డులే లేకుండా ఫ్రెష్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (ఎస్‌డబ్లూఎం) పాలసీకి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని తెలిపారు. జనవరి నెలాఖరుకు డంప్ యార్డులో చెత్తను తొలగించి, ప్రజలకు ఆహ్లాదం పంచే ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరంలో పారిశుధ్య నిర్వహణపై నిర్ల క్ష్యం వీడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మున్సిపల్ ఆర్డీ నాగరాజు, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ రామ్మోహనరెడ్డి, ఈఈ ఆదినారాయణ, నగరపాలక సంస్థ ఈఈలు షాకీర్, చంద్రశేఖర్, డీఈలు, ఏఈలు, శానిటేషన ఇనస్పెక్టర్లు, సచివాలయ సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.