Share News

New Teachers కొత్తకొత్తగా..!

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:12 AM

కొత్త టీచర్లు విధుల్లో చేరారు. డీఎస్సీ-2025లో ఉద్యోగాలు సాధించిన వారు సోమవారం పాఠశాలలకు వెళ్లి రిపోర్ట్‌ చేసుకున్నారు. ఆయా మండలాల ఎంఈఓల ఆధ్వర్యంలో విధుల్లో చేరారు.

New Teachers కొత్తకొత్తగా..!
కదిరిలో కొత్త టీచర్లను అభినందిస్తున్న కందికుంట

బడిబాట పట్టిన కొత్త టీచర్లు

తీరనున్న ఉపాధ్యాయుల కొరత

జిల్లాకు 260 మంది కేటాయింపు

హిందూపురం/కొత్తచెరువు/కదిరి, అక్టోబరు13(ఆంధ్రజ్యోతి): కొత్త టీచర్లు విధుల్లో చేరారు. డీఎస్సీ-2025లో ఉద్యోగాలు సాధించిన వారు సోమవారం పాఠశాలలకు వెళ్లి రిపోర్ట్‌ చేసుకున్నారు. ఆయా మండలాల ఎంఈఓల ఆధ్వర్యంలో విధుల్లో చేరారు. వీరికి పాఠశాల విద్యాశాఖ ఆనలైన కౌన్సెలింగ్‌ నిర్వహించి పని ప్రదేశాలను కేటాయించిన విషయం తెలిసిందే. కొత్త గురువుల రాకతో జిల్లాలో జిల్లాలోని మారుమూల పల్లెల్లోని పాఠశాలల్లో బోధనా సమస్యలు తీరుతాయని పలువురు పేర్కొంటున్నారు. డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు ఎనిమిది రోజులపాటు హిందూపురంలోని బిట్‌ కళాశాలలో శిక్షణ ఇచ్చారు. జోనల్‌ పోస్టులకు ఎంపికైన వారికి మరోచోట శిక్షణ ఇప్పించారు. వారికి వెబ్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చి పాఠశాలలను కేటాయించారు. దీనివల్ల చాలాచోట్ల ఉపాధ్యాయుల కొరత తీరనుంది.

బదిలీ ఉపాధ్యాయులకు ఊరట

గతంలో సాధారణ బదిలీల్లో కొంతమంది ఉపాధ్యాయులు బదిలీ అయినప్పటికీ పాతచోటే కొనసాగుతున్నారు. పాత స్థానంలోకి సబ్జెక్ట్‌ టీచర్‌ రాకపోవడంతో యథావిధిగా పనిచేయాల్సి వచ్చింది. కొత్తగా నియమించిన ఉపాధ్యాయులు రావడంతో బదిలీ ఉపాధ్యాయులకు కేటాయించిన స్థానాల్లో చేరడానికి ఆస్కారం ఏర్పడనుంది.

జిల్లాకు 260 మంది: కిష్టప్ప, డీఈఓ

నూతనంగా నియమితులైన ఉపాధ్యాయులు వారికి కేటాయించిన పాఠశాలలో సోమవారం నుంచే విధుల్లోకి చేరాలి. అందరికీ పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చాం. మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. జిల్లాకు 260మందిని కేటాయించారు. అయితే వీరిలో ఎస్డీటీలు ఎంతమంది ఎస్‌ఏలు ఎంతమంది అని తెలియాల్సి ఉంది.

టీచర్లను అభినందించిన ఎమ్మెల్యే

మెగా డీఎస్సీ-2025లో ఉపాధ్యాయ పోస్టులు సాధించిన వారిని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అభినందించారు. స్థానిక వీవర్స్‌ కాలనీ మునిసిపల్‌ హైస్కూల్‌లో ఉపాధ్యయ పోస్టులు సాధించిన టీచర్లను ఎమ్మెల్యే సోమవారం కలిసి అభినందించారు. ఎన్నికలలో చెప్పిన విధంగా ప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రకటించి 150 రోజులలోనే ప్రక్రియను పూర్తి చేసిందన్నారు. దాదాపు 16వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంఈఓలు చెన్నకృష్ణ, ఓబుల్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 12:12 AM