Minister Satya kumar రెండేళ్లలో పెనుకొండకు మెడికల్ కళాశాల
ABN , Publish Date - Apr 18 , 2025 | 11:36 PM
రాష్ట్రంలో పది వైద్య కళాశాలలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించాలని ప్రబుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మడకశిరకు వెళ్తూ మార్గమధ్యలో పెనుకొండలోని సన్నిహితుల ఇంటికొచ్చారు.
ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
పెనుకొండ టౌన, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పది వైద్య కళాశాలలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించాలని ప్రబుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మడకశిరకు వెళ్తూ మార్గమధ్యలో పెనుకొండలోని సన్నిహితుల ఇంటికొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో ఓ వైద్యకళాశాల ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 17 కొత్త కాలేజీలను మంజూరు చేసిందన్నారు. వీటి ఏర్పాటు ప్రభుత్వ రంగంలోనా, ప్రైవేట్ రంగంలోనా అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేసిందన్నారు. కళాశాలల ఏర్పాటుకు రూ.8,800 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం ఆర్భాటంగా పనులు మొదలుపెట్టి నాలుగేళ్లలో 14 శాతం పనులుచేసి రూ.2,100 కోట్లు ఖర్చు చేసిందన్నారు. పెనుకొండలో ఉన్న వైద్య కళాశాల పునాదులు వేసి కేవలం ఒక అంతస్తు మాత్రమే నిర్మించిందన్నారు. కొత్త ప్రభుత్వం వైద్య కళాశాలల నిర్మాణానికి దృఢ నిశ్చయంతో ఉందన్నారు. పెనుకొండ వైద్య కళాశాలను రెండేళ్లలో అన్ని వసతులతో అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి సత్యకుమార్‌యాదవ్ స్పష్టం చేశారు.
హక్కుల సాధనకు ఐక్యత చాటుదాం
ధర్మవరం(ఆంధ్రజ్యోతి): హక్కుల సాధనకు ఐక్యత చాటుదామని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపికైన జయశ్రీ సన్మానసభను పట్టణంలోని పోలా ఫంక్షనహాల్‌లో శుక్రవారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల్లో అధిక శాతం బీసీలకే అందుతున్నాయన్నారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ.. బీసీలంతా ఏకమైతేనే ఏ సమస్యనైనా సాధించుకోవచ్చన్నారు. రాజకీయాల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో బీసీసంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి, రాష్ట్ర నాయకుడు క్రాంతికుమార్, జిల్లా అద్యక్షుడు నామాల శంకర్, ఏపీ సీడ్స్ కార్పొరేషన డైరెక్టర్ కమతం కాటమయ్య, టీడీపీ పట్టణాధ్యక్షుడు పరిశే సుధాకర్ పాల్గొన్నారు.