జోరుగా మట్కా, పేకాట
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:35 AM
ఒకప్పుడు జిల్లాలోనే మట్కా నిర్వహణలో తాడిపత్రి టాప్. దినదినాభివృద్ధి చెంది ప్రస్తుతం రాయలసీమలోనే టాప్‌గా నిలిచింది.
తాడిపత్రి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు జిల్లాలోనే మట్కా నిర్వహణలో తాడిపత్రి టాప్. దినదినాభివృద్ధి చెంది ప్రస్తుతం రాయలసీమలోనే టాప్‌గా నిలిచింది. ముంబై తర్వాత తాడిపత్రి, ప్రొద్దుటూరే ఉన్నాయని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అప్పట్లో రూ.లక్షల్లో టర్నోవర్ జరిగేది. ప్రస్తుతం మట్కా ఆడే వారి సంఖ్య పెరగడంతో టర్నోవర్ కూడా రూ.కోట్లకు చేరింది. ప్రొద్దుటూరు, నంద్యాల, కడప తదితర పట్టణాల నుంచి ఇక్కడకు వచ్చి లాడ్జీలు తీసుకొని మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం. పట్టపగలే ఎక్కడబడితే అక్కడ పేకాటస్థావరాలు వెలుస్తున్నాయి. పట్టణంలో కొన్నిచోట్ల ఇళ్లల్లోనే మట్కా, పేకాట నిర్వహిస్తున్నారు. మట్కా ఆడేవారు గతంలో లాగా నేరుగా మట్కాబీటర్ల వద్దకు వెళ్లకుండా వాట్సాప్, ఆనలైనను ద్వారా సంప్రదిస్తున్నారు. కొందరి పోలీసుల నిర్లక్ష్యం.. మరికొందరు మామూళ్ల మత్తులో ఉండటంతో మట్కా, పేకాట నిర్వహకుల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయల్లా సాగుతోంది. తాడిపత్రి ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా ఉండడంతో బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వందల సంఖ్యలో కూలీలు వలసవచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. కార్మికులు సంపాదించిన కూలి డబ్బులను సాయంత్రం అయ్యేసరికి అధిక డబ్బులకు ఆశపడి మట్కా ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సంపాదించిన డబ్బులు మొత్తం పొగొట్టుకొని అప్పులపాలవుతున్నారు. దీంతో కుటుంబ పోషణ కూడా కష్టమవుతోంది. కుటుంబాలతో సహా వీధిన పడుతున్నారు. పోలీసులు నామమాత్రపు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప పూర్తిస్థాయిలో అరికట్టేలా చర్యలు తీసుకోవడం లేదు.