రోడ్లపై పశువుల సంచారం
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:44 PM
మండల కేంద్రంలోని వివిధ ఆలయాలకు చెందిన ఆవులు, దూడలు దాదాపుగా వందకు పైగా ఉన్నాయి.
విడపనకల్లు, సెపెంబరు 6(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని వివిధ ఆలయాలకు చెందిన ఆవులు, దూడలు దాదాపుగా వందకు పైగా ఉన్నాయి. వాటికి గోశాల లేకపోవడంతో అవన్నీ జాతీయ రహదారిపై, ఇతర రోడ్లుపై తిరుగుతుంటాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుండటంతో పాటు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. నెల క్రితం బళ్లారికి చెందిన దంపతులు ద్విచక్రవాహనంలో వెళ్తుండగా.. ఆవులు అడ్డు రావడంతో కిందపడి.. తీవ్రంగా గాయపడ్డారు. అలాగే వారం క్రితం పాల్తూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుంగా.. ఆవులు అడ్డురావడంతో కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని బళ్లారి ఆసుపత్రికి తరలించగా.. వేల రూపాయిలు ఖర్చు అయింది. ప్రతి నెలా రెండు, మూ డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గౌరమ్మ దేవి, సుంకులమ్మ దేవి, బసవేశ్వర ఆలయాలకు చెందిన ఆవులను ఊరిపైకి వదిలేసి ఉం టారు. ఈ పశువులు రోడ్డుపై ఎటు పడితే అటు తిరుగుతున్నా.. అవి దేవుడి పశువులు కావడంతో ఎవరూ ఏమీ అనడం లేదు. వాటికి ఓ గోశాలను ఏర్పాటు చేసి.. ఈ సమస్యలు, ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.