basic amenities కనీస సౌకర్యాలూ కరువు
ABN , Publish Date - May 14 , 2025 | 12:02 AM
అమడగూరు మండలంలో ఉపాధి పనులు చేపట్టే ప్రాంతాల్లో అధికారులు కనీస సౌకర్యాలూ కల్పించడం లేదు.
అమడగూరు (కదిరి), మే 13(ఆంధ్రజ్యో తి): అమడగూరు మండలంలో ఉపాధి పనులు చేపట్టే ప్రాంతాల్లో అధికారులు కనీస సౌకర్యాలూ కల్పించడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధి పనుల ప్రాంతాల్లో నీరు, నీడ కల్పించడంతో పాటు మెడికల్ కిట్లు, పనిముట్లు అందుబాటులో ఉంచాయి. కాని కూలీలకు అధికారులు ఈ సౌకర్యాలు ఏవీ కల్పించడం లేదు. అసలే ఎండాకాలం. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ సమయంలోనూ ఉపాధి పనులు చేసే ప్రాంతాల్లో నీడ సౌకర్యం కల్పించడం లేదు. దీంతో కూలీలు ఎండలోనే ఆ పనులు చేస్తూ.. సొమ్మసిల్లి పడిపోతున్నారు. కొందరు వడదెబ్బకు గురవుతున్నారు. వారి ఆరోగ్యంలో కూడా దెబ్బతింటోంది.
ఎండలోనే పనులు
మండలంలో జాబ్‌కార్డుల ప్రకారం దాదాపు ఆరువేల మంది కూలీలున్నారు. పది పంచాయతీలోనూ ఉపాధి కల్పనకు చర్యలు చేపట్టారు. దీంతో దాదాపు రెండు వేల మంది కూలీలు పనులు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నీడ కోసం షామియాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా .. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నీడ, నీరుతో పాటు తమకు పనిముట్లు అందజేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు.