ISCON: నేటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:18 AM
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని వేడుకలకు జిల్లాలోని కృష్ణమందిరాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జిల్లాకేంద్రంలోని ఇస్కాన్ మందిరంలో శుక్రవారం నుంచి వేడుకలు ప్రారంభమవనున్నాయి.
అనంతపురం టౌన, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని వేడుకలకు జిల్లాలోని కృష్ణమందిరాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. జిల్లాకేంద్రంలోని ఇస్కాన్ మందిరంలో శుక్రవారం నుంచి వేడుకలు ప్రారంభమవనున్నాయి. ఇస్కాన్ మందిరాన్ని విద్యుద్దీపాలంకరణలు, ప్రత్యేక డెకరేషన్‌లతో ముస్తాబుచేశారు. గోకులకృష్ణుడిని దర్శించుకునేందుకు వచ్చే వేలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయం వద్ద ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం ఇస్కాన్ మందిరం వద్ద బారికేడ్ల నిర్మాణం చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణ మందిరాల్లోనూ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించనున్నారు. వేడుకల నేపథ్యంలో తల్లిదండ్రులు సైతం తమ చిన్నారులకు రాధా, కృష్ణుల వేషాలు వేయించి ముచ్చటపడేందుకు సమాయత్తమయ్యారు.
వేడుకలకు సర్వం సిద్ధం
- దామోదర్ గౌరంగదాస్, ఇస్కాన మందిర చైర్మన
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లను సిద్ధం చేశాం. వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు విశ్వశాంతి మహాయజ్ఞం, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు హరినామ సంకీర్తన, సాయంత్రం 4గంటలకు ఆలయం ముందు భక్తులచే ఉట్టి కొట్టు ఉత్సవం, 5 గంటలకు హనుమద్ వాహనసేవ, 6 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రి 8 గంటలకు ఊంజల సేవ నిర్వహిస్తాం. శనివారం కృష్ణాష్టమి పర్వదినాన ఉదయం నుంచే రాధాపార్థసారథులకు ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణలు చేయడంతోపాటు ఉదయం 10 గంటలకు హరినామ యజ్ఞం, భక్తులకు దర్శన వసతి కల్పిస్తాం. ఆదివారం ఇస్కాన వ్యవస్థాపకుడు భక్తివేదాంత శ్రీల ప్రభుపాదుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహాభిషేకం, మధ్యాహ్నం 12.30 గంటలకు అన్నదాన కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి.
రేపు సాయిగోకులం...
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని సాయి ట్రస్టు, శ్రీనృత్యకళానిలయం సంయుక్త ఆధ్వర్యంలో లలితకళాపరిషతలో శనివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు సాయిగోకులం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈమేరకు సాయి ట్రస్టు అధ్యక్షుడు విజయసాయికుమార్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.