KARTHIA POURNAMI: కార్తీక దీపం... సకల పాపహరణం
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:56 PM
కార్తీకమాసమంటేనే భక్తిభావం. ఈ మాసంలో పౌర్ణమి రోజు వెలిగించే ప్రతి దీపంలోనూ సాక్షాత్తు త్రయంబకేశ్వరుడు కొలువై వుంటాడన్నది పురాణాలు చెబుతున్న సారాంశం. ఈ పర్వదినంకోసం యావత్ భక్తకోటి వేయికళ్లతో ఎదురుచూస్తుంటుంది.
అనంతపురం టౌన, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): కార్తీకమాసమంటేనే భక్తిభావం. ఈ మాసంలో పౌర్ణమి రోజు వెలిగించే ప్రతి దీపంలోనూ సాక్షాత్తు త్రయంబకేశ్వరుడు కొలువై వుంటాడన్నది పురాణాలు చెబుతున్న సారాంశం. ఈ పర్వదినంకోసం యావత్ భక్తకోటి వేయికళ్లతో ఎదురుచూస్తుంటుంది. ఈ పౌర్ణమి హిందువులకు పరమపవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పర్వదినం. ఆశ్వీయుజ అమావాస్య దీపావళి మరుసటిరోజునుంచి కార్తీకమాసం ముగిసేవరకూ రోజూ ఉదయం, సాయంత్రం భక్తజనం దీపాలు వెలిగించి పరమశివునికి సంరంభణం చేస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, పౌర్ణమినాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈరోజున శివాలయంలో దీపాలు వెలిగించినవారికి సకల పాపాలు తొలగి, సుఖసంపదలు కలుగుతాయని విశ్వాసం. పలుప్రాంతాల్లో కార్తీకపౌర్ణమినాడు సత్యనారాయణస్వామి వ్రతాలను కూడా నిర్వహిస్తారు. కాగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం ముక్కంటి ఆలయాలన్నీ భక్తజనసందోహంతో కిటకిటలాడనున్నాయి.
నేడు మంచులింగ దర్శనం
కార్తీకమాసంలో మొదటిరోడ్డు కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రతియేటా వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు మంచులింగ దర్శనం ఏర్పాటు చేశాం. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు దర్శనానికి హాజరయ్యే వేలాదిమంది భక్తులందరికీ ప్రసాద వితరణ చేస్తున్నాం.
-అమిలినేని నరేంద్ర చౌదరి, చైర్మన,
మొదటిరోడ్డు శివాలయం
విశేష పుణ్యఫలం దక్కుతుంది
శివుడు, విష్ణుమూర్తికి చాలా ప్రీతిపాత్రమైనది కార్తీక మాసం. ఈ మాసంలో శివుడు, విష్ణుమూర్తికి ఆరాధనలు చేయడంతోపాటు అయ్యప్ప, భవాని దీక్షపూజలు ప్రారంభమవుతాయి. మహాభారతం కథనానుసారం కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీకపౌర్ణమి. ప్రజలను తీవ్రంగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో ప్రజలు దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. ఈరోజున బ్రాహ్మణులకు దీపదానం చేయడం వల్ల జన్మజన్మల పుణ్యఫలం దక్కుతుంది.
-నరసింహశాసి్త్ర, వేదపండితుడు