ఆగిన కైరేవు రోడ్డు నిర్మాణం
ABN , Publish Date - Oct 23 , 2025 | 12:07 AM
శెట్టూరు నుంచి కైరేవు మీదుగా చెర్లపల్లికి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు ఆగిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శెట్టూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): శెట్టూరు నుంచి కైరేవు మీదుగా చెర్లపల్లికి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు ఆగిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్ల కిత్రం నాటి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ఈ పనులకు నిధులు కేటాయించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. మొత్తం ఆరు కిలోమీటర్లకు గాను కొంత వరకు కంకర వేసి.. మరికొంత వరకు మట్టి పోసి.. ఇక చాలా వరకు అలాగే వదిలేశారు. దీంతో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కనీసం ఆటో కూడా రావడం లేదు. దీంతో ఎదైనా అత్యవసర పరిస్థితుల్లో బైక్‌లపైనే ఆ గతుకుల రోడ్డులో వెళ్లాల్సి వస్తోంది. ఇక వర్షం వచ్చిందంటే పరిస్థితి మరీ ఘోరం. అనేక మంది ద్విచక్రవాహనదారులు కిందపడి ఆస్పత్రుల పాలయ్యారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు.