వానొచ్చినా ఆగదు
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:21 AM
ఈసారి వర్షం వచ్చినా మెగా డీఎస్సీ సభ ఆగదని, తప్పకుండా జరిపితీరుతామని విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు తెలిపారు. ఈనెల 19న జరగాల్సిన సభను భారీ వర్షాల వల్ల ఇబ్బందులు వస్తాయోమోననే సందేహంతో చివరి నిమిషంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే.
25న అమరావతిలో మెగా డీఎస్సీ సభ
ఎంపికైన ప్రతిఒక్కరూ హాజరు కావాలి
బస్సులు, భోజనం ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
విద్యాశాఖాధికారులకు కమిషనర్ ఆదేశం
అనంతపురం విద్య, సెప్టెంబరు22(ఆంధ్రజ్యోతి): ఈసారి వర్షం వచ్చినా మెగా డీఎస్సీ సభ ఆగదని, తప్పకుండా జరిపితీరుతామని విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు తెలిపారు. ఈనెల 19న జరగాల్సిన సభను భారీ వర్షాల వల్ల ఇబ్బందులు వస్తాయోమోననే సందేహంతో చివరి నిమిషంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే. వాయిదా పడిన ఆ సభను ఈనెల 25న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లపై కమిషనర్ సోమవారం విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ డీఎస్సీ-2025లో ఎంపికైన వారికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అమరావతిలో ఈనెల 25న నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ఆమేరకు ఎంపికైన వారికి సమాచారం అందించి, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. డీఎస్సీలో ఎంపికైన ప్రతి ఒక్కరితో పాటు వారికి సంబంధించిన మరొకరు విధిగా హాజరుకావాల్సి ఉంటుందన్నారు. అనంత జిల్లా నుంచి 24న ఉదయమే అమరావతికి బయలుదేరి రావాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులకు అవసరమైన బస్సులు, భోజనం, టిఫిన, పర్యవేక్షణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. ప్రతిబస్సుకు ఒక ఎంఈఓ లేదా హెచఎం, ఒక పీడీ, ఒక పోలీ్‌సను పర్యవేక్షణకు నియమించాలని ఆదేశించారు. ఏ జిల్లాలో ఎంపికైన అభ్యర్థి ఆ జిల్లా నుంచి వచ్చే బ స్సులలోనే రావాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ గర్భిణులు, బాలింతలు, ఏమైనా సర్జరీలు చేయించుకున్న అభ్యర్థులు సభకు రాలేకపోతే వారి సమాచారం ముందే తెలియజేయాలని, అలాంటి వారికి సభలో నియామకపత్రాలు పెండిండ్‌లో ఉంచి డీఈఓల ద్వారా అందించేలా చూస్తామన్నారు. అన్నిశాఖలు సమన్వయం చేసుకొని పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు.
రేపు ఉదయమే అనంతకు చేరుకోవాలి
మెగా డీఎస్సీ సభకు అమరావతికి వెళ్లే విజేతలు అందరూ 24 న ఉదయమే అనంతపురం చేరుకోవాలని డీఈఓ ప్రసాద్‌బాబు సూచించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. ఎంపికైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉం టుందన్నారు. వీరి కోసం 45ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి అభ్యర్థి ఉదయం 5గంటలకే ఆలమూరు రోడ్డు నందుగల పీవీకేకే కళాశాల వద్దకు చేరుకోవాలన్నారు. ఇదివరకే ఐడీ కార్డు తీసుకున్న అభ్యర్థులు వారి సహాయకులు వాటిని వెంట తెచ్చుకోవాలని డీఈఓ సూచించారు.