Share News

అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:05 AM

వ్యసనాలు ఆ ఇద్దరిని నేరస్థులుగా మార్చాయి. పాతికేళ్లు నిండకుండానే చైనస్నాచింగ్‌, నకిలీ కరెన్సీ వంటి నేరాలు చేయడంలో ఆరితేరారు.

 అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

అనంతపురం క్రైం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): వ్యసనాలు ఆ ఇద్దరిని నేరస్థులుగా మార్చాయి. పాతికేళ్లు నిండకుండానే చైనస్నాచింగ్‌, నకిలీ కరెన్సీ వంటి నేరాలు చేయడంలో ఆరితేరారు. ఇందులో ఒకరు రష్యా వెళ్లి ఎంబీబీఎస్‌ చేయాల్సి ఉండగా చెడు సావాసంతో కటకటాల పాలయ్యాడు. చైన స్నాచింగ్‌, నకిలీ నోట్ల తయారీకి పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచీ రూ.35 లక్షల బంగారం ఆభరణాలు, నగదు, నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ జగదీష్‌ శుక్రవారం విలేకరుల సమావేశం లో వివరాలు వెల్లడించారు. కంబదూరులోని పాత ఎస్సీ కాలనీకి చెందిన 25 ఏళ్ల జశ్వంత అలియాస్‌ జశ్వంత రాజు, కంబదూరులోని ఆర్డీటీ కాలనీకి చెందిన 21 ఏళ్ల కంబదూరు భోగం రాజు అలియాస్‌ షాలేము రాజు బంధువులు, స్నేహితులు. జశ్వంత పెద్దగా చదువుకోలేదు. కర్ణాటక తదితర ప్రాంతాల్లో చైన స్నాచింగ్‌కు పాల్పడేవాడు. ఆయనపై కర్ణాటకలో ఆరు కేసులు ఉన్నాయి. నాలుగేళ్లుగా కర్ణాటకలోని పావగడ, కళ్యాణదుర్గం, కంబదూరు ప్రాంతాల్లో వాహనాల చోరీ, ఇళ్లలో దొంగతనాలు, చైనస్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. 2021లో పావగడలో 2 కేసులు, వైఎన హొసకోటలో ఒకటి, 2023లో కళ్యాణదుర్గంలో ఒకటి, 2004లో కంబదూరు స్టేషన రెండు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తన ఫ్రెండ్‌ భోగం రాజును సైతం అటువైపు మళ్లించాడు. అతడితో కలిసి నేరాలకు పాల్పడ్డాడు.

ఎంబీబీఎస్‌ కోసం రష్యా వెళ్లాలని...

భోగం రాజు వచ్చే నెలలో ఎంబీబీఎస్‌ చదవడం కోసం రష్యా వెళ్లాల్సి ఉంది. జశ్వంతతో ఉన్న స్నేహం వల్ల అతడు జల్సాలకు పెట్టే ఖర్చులు చూసి భోగం రాజు కూడా అతడి మాయలో పడ్డాడు. సులభంగా వచ్చే డబ్బుతో జల్సాలు చేసేవారు. ఇద్దరూ రెండేళ్లుగా నేరాల్లో పాల్గొంటూ వచ్చారు. ద్విచక్రవాహనాన్ని ఒకరు వేగంగా నడిపితే, మరొకరు మహిళల మెడలో బంగారు చైన్లు లాగేసేవాడు. అనంతపురం, పుట్లూరు, నార్పల, ఉరవకొండ, తాడిపత్రి, కడప జిల్లా సింహాద్రిపురం మండలం తదితర ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లే మహిళను టార్గెట్‌ చేసుకుని చైన్లు లాక్కెళ్లేవారు. దొంగిలించిన బంగారు నగలను విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసుకునేవాళ్లు. ఇద్దరిపై రెండేళ్లలో 12 కేసులు నమోదయ్యాయి. అనంతపురం నాలుగో పట్టణ పోలీస్టేషనలో ఒకటి, నార్పలలో-2, ఉరవకొండలో-1, తాడిపత్రిలో-3, తాడిపత్రి రూరల్‌-1, అనంతపురం రూరల్‌-1, పుట్లూరులో 2, కడప జిల్లా సింహాద్రిపురంలో ఒక కేసు నమోదైంది. నకిలీ కరెన్సీ కూడా ముద్రించి సుమారు రూ. 2 లక్షల వరకూ చలామణి చేసినట్లు సమాచారం. చైన స్నాచర్లపై నిఘా పెట్టిన పుట్లూరు, అనంతపురం సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టిరు. ఈక్రమంలోనే పుట్లూరు మండలం శనగలగూడురు సమీపంలో స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 35 లక్షల విలువైన 34 తులాల బంగారం ఆభరణాలు, రూ.35500నగదు, రూ. 500 నకిలీ నోట్లు, ప్రింటర్‌, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదింపులో కీలకంగా వ్యవహించిన సీఐలు సత్యబాబు, సీసీఎస్‌ ఇనస్పెక్టర్లు శేషగిరి, జయపాల్‌రెడ్డి, వలిబాషా, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను ఎస్పీ జగదీష్‌ ప్రశంసాపత్రాలు, రివార్డులతో అభినందించారు.

Updated Date - Sep 20 , 2025 | 12:05 AM