Share News

అక్రమంగా కల్లు విక్రయాలు

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:11 PM

మం డలంలో అక్రమంగా కల్లును యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రాత్రింబవళ్లు కల్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

అక్రమంగా కల్లు విక్రయాలు
దేవాలయం పక్కన ఏర్పాటు చేసిన కల్లు దుకాణం

బొమ్మనహాళ్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): మం డలంలో అక్రమంగా కల్లును యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రాత్రింబవళ్లు కల్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కాలువల పక్కన కల్లు దుకాణాలు ఏర్పాటు చేసినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో ఇక ఏకంగా దేవాలయం పక్కనే ఓ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు, మహిళలు ఆలయానికి వెళ్లడానికే జంకుతున్నారు. కాలువల పక్కనే కల్లు దుకాణాలు ఉండటంతో తాగిన మైకంలో కాలువలో పడి చనిపోయే ప్రమాదముంది. బెళుగుప్ప మండలం నుంచి ప్రతి రోజూ.. ఉదయమే ఒక వాహనంలో కల్లును అక్రమంగా బొమ్మనహాళ్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. తమకు సొంత ఈత చెట్లు ఉన్నాయంటూ కొందరు అబద్దపు పత్రాలు చూపించి కల్లు దుకాణాలకు అనుమతులు పొందారు. బెళుగుప్ప నుంచి కల్లును తెప్పించుకొని విక్రయిస్తున్నారు. బొమ్మనహాళ్‌ కర్ణాటక ప్రాంతానికి సరిహద్దులో ఉండడంతో బళ్లారి, కోళగల్లు, ఎత్తినబూదేహళ్‌, ఇంబ్రపురం ప్రాంతలకు చెందిన యువకులు బైక్‌ల్లో గుంపులు... గుంపులుగా వచ్చి కల్లు తాగి.. మత్తులో గొడవలకు పాల్పడుతున్నారు. దీంతో గ్రామాల్లో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతోందని, అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:11 PM