rains వానొస్తే నీరంతా ఆ ఇంట్లోకే!
ABN , Publish Date - May 19 , 2025 | 11:31 PM
మండల కేంద్రం లో ఓ చిన్నపాటి వర్షం కురిసినా... పూజారి గీత, శంకర్‌కు చెందిన ఇంట్లోకి వాన నీరు వస్తోంది.
తనకల్లు, మే 19(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం లో ఓ చిన్నపాటి వర్షం కురిసినా... పూజారి గీత, శంకర్‌కు చెందిన ఇంట్లోకి వాన నీరు వస్తోంది. తనకల్లులోని కాలువల్లోని నీరు చిన్నచెరువులోకి మళ్లించాల్సి ఉంది. జాతీయ రహదారి విస్తరణ అధికారులు ఆ కాలువను చౌడేశ్వరీ అమ్మవారి ఆలయం వరకు తీసి వదిలేశారు. దీంతో ఊర్లోని వర్షపు నీరంతా ఆ కాలువ ద్వారా అక్కడికి చేరుకొని.. ముందుకు పోవడానికి వీలులేకపోవడంతో సమీపంలోని పూజారి గీత, శంకర్ ఇంట్లో చేరుతోంది. ఈ సమస్యను వారు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఇటు జాతీయ రహదారుల అధికారులు అటు గ్రామ పంచాయతీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో వాన వచ్చినప్పుడల్లా.. ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే ఇల్లు సగానికి పైగా పడిపోయింది. ఉన్నదాంట్లోనే వారు నివాసముంటున్నారు. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఆ ఇళ్లు పూర్తిగా మునిగిపోయింది. దీంతో రాత్రంతా ఆ కుటుంబం నీళ్లలోనే ఉంటూ.. జాగారం చేయాల్సి వచ్చింది. తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు వారు ఫోన చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సోమవారం ఉదయం వారు ఇంటి గోడను పగలగొట్టుకొని.. బయటకు వచ్చారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని, నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.