Idva వేధింపులను అడ్డుకోండి
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:49 PM
మైక్రో ఫైనాన్స సంస్థల వేధింపుల నుంచి ప్రజలను కాపాడాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ హోంలో బుధవారం ఐద్వా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల అవగాహన, మైక్రో ఫైనాన్స వడ్డీ వ్యాపారుల నుంచి కాపాడాలంటూ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు.
పేదలను దోచుకుంటున్న మైక్రో ఫైనాన్స సంస్థలు
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి
అనంతపురం టౌన, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మైక్రో ఫైనాన్స సంస్థల వేధింపుల నుంచి ప్రజలను కాపాడాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ హోంలో బుధవారం ఐద్వా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల అవగాహన, మైక్రో ఫైనాన్స వడ్డీ వ్యాపారుల నుంచి కాపాడాలంటూ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, జిల్లా కోశాధికారి చంద్రిక సంయుక్త అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సుకు రమాదేవితోపాటు ఎల్‌డీఎం నరేష్ రెడ్డి, మెప్మా పీడీ విశ్వజ్యోతి, టెక్నికల్ ఎక్స్‌పర్ట్ వాసుదేవరెడ్డి, బ్యాంకింగ్ అధికారి భ్రమరాంబ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలిచ్చిన కొన్ని మైక్రో ఫైనాన్స కంపెనీలు అధిక వడ్డీలతో దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తీర్చలేక ఒత్తిడికి గురై అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. మైక్రో ఫైనాన్స సంస్థల ఆగడాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. డ్వాక్రా సంఘాల్లో సభులు రుణాలు పొందాలంటే ఆర్పీలు, పై సిబ్బందికి కమీషన్లు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని, ఈ సంస్కృతిని నిర్మూలించాలని కోరారు. అనంతరం ఎల్‌డీఎం నరేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా రుణాలందిస్తున్నాయన్నారు. సబ్సిడీ రుణాలు, విద్య, ఉపాధి, ఆర్థిక అవసరాలకు తక్కువ వడ్డీలతోనే రుణాలు మంజూరు చేస్తున్నాయని తెలిపారు. మెప్మా పీడీ విశ్వజ్యోతి మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల సభ్యులు ఎవరికీ ఎలాంటి కమీషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా కమీషన్లు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. బ్యాంకింగ్ అధికారిని భ్రమరాంబ మాట్లాడుతూ... ప్రజలకు తక్కువ ప్రీమియంతో ఆరోగ్య, ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి మాట్లాడుతూ జిల్లాలో మైక్రో ఫైనాన్స సంస్థల రుణ ఒత్తిళ్లతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఏ షూరిటీ లేకుండా రుణాలు ఇచ్చి, నెల కంతు చెల్లించకపోతే గద్దల్లా ఇళ్లమీదకు వాలిపోయి వడ్డీవ్యాపారులు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎస్పీలు దృష్టి సారించి ప్రజలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు శ్యామల, నగర అధ్యక్ష కార్యదర్శులు శంషాద్, అశ్విని, నగర నాయకులు గీత, శైలజ, వహీదా, షర్యాబి తదితరులు పాల్గొన్నారు.