రోజంతా హై టెన్షన..
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:20 AM
తాడిపత్రి నియోజకవర్గంలో రోజంతా హైటెన్షన నడిచింది. తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం బయల్దేరడంతో పట్టణ వాసుల్లో ఆందోళన నెలకొంది.
తాడిపత్రికి బయల్దేరిన పెద్దారెడ్డి
ఫ మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు
ఫ వెనక్కి వెళ్లాలని సూచన
ఫ ససేమిరా అన్న మాజీ ఎమ్మెల్యే
ఫ ఆరుగంటల పాటు రోడ్డుపైనే బైఠాయింపు
ఫ ఎట్టకేలకు వెనక్కి పంపించిన పోలీసులు
తాడిపత్రి/పుట్లూరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): తాడిపత్రి నియోజకవర్గంలో రోజంతా హైటెన్షన నడిచింది. తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సోమవారం బయల్దేరడంతో పట్టణ వాసుల్లో ఆందోళన నెలకొంది. పట్టణంలో ధ్యానశివుడి విగ్రహావిష్కరణకు మున్సిపల్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీ సంఖ్యలో గుమికూడారు. అదే సమయంలో పెద్దారెడ్డి పట్టణానికి వస్తుండడంతో ఎప్పుడు, ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దారి మధ్యలోనే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన అక్కడే ఆరుగంటలపాటు బైఠాయించారు. ఎట్టకేలకు సాయంత్రం ఆయనను పోలీసులు వెనక్కి పంపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఎన్నికల సమయం నుంచి..
గతేడాది ఎన్నికల సమయం నుంచి పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉంటున్నారు. ఆయనను రానివ్వమని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి పలుమార్లు తాడిపత్రికి రావాలని ప్రయత్నించినా.. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్డారెడ్డి.. హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో సోమవారం మరోసారి తాడిపత్రికి వెళ్తున్నట్లు ప్రకటించారు. ఇదేరోజే జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టణంలోని అనంతపురం రోడ్డులోని ఫ్లైఓవర్ సమీపాన ధ్యానశివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు వేలాదిగా టీడీపీ శ్రేణులు, ఆయన అనుచరులు హాజరయ్యారు.
అడ్డుకున్న పోలీసులు
పెద్దారెడ్డి యల్లనూరు మండలంలోని స్వగ్రామం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి అనుచరులతో కలిసి బయల్దేరారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ పుట్లూరు మండలంలోని నారాయణరెడ్డి పల్లి వద్ద పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనీ, తాడిపత్రికి అనుమతించబోమని చెప్పారు. కోర్టు అనుమతితో వెళ్తున్నాననీ, అడ్డుకోవడం ఏమిటంటూ పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదం చేశాడు. అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఆరుగంటలపాటు అక్కడే ఉన్నారు. సాయంత్రం 6గంటల సమయంలో అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తిమ్మంపల్లికి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో చేసేదిలేక పెద్దారెడ్డి వెనుదిరిగారు. దీంతో తాడిపత్రి వాసులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
కోర్డు ఆర్డర్ ఉన్నా.. అడ్డుకుంటారా..?
మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులే స్వయంగా తనను తాడిపత్రిలోని ఇంటికి చేర్చాలని హైకోర్టు ఆదేశించినా.. వారే అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. 16నెలలుగా తనను తాడిపత్రికి వెళ్లనీయలేదన్నారు. ‘నా ఇంటికి వెళ్లడానికి నేనేమైనా వేరే దేశంలో ఉన్నానా? వీసా ఏమైనా తీసుకోవాలా?’ అంటూ పోలీసులను నిలదీశారు. మళ్లీ కోర్టుకు వెళ్తానన్నారు. అడ్డుకున్న అధికారులు, కక్ష సాధిస్తున్న వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. పెద్దారెడ్డిని కలవడానికి వచ్చిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. తాడిపత్రిలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యేను తన ఇంటికి వెళ్లనీయకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఆయనను పోలీసులు బలవంతంగా జీపులో ఎక్కించి పంపించారు.