Share News

హై టెన్షన..!

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:44 AM

పట్టణంలో హైటెన్షన. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఐదు వాహనాలు, 40 మందితో సోమవారం ఆయన పట్టణానికి రావడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే విషయంలో అనంతపురం రహదారిలోని ఫ్లైఓవర్‌

హై టెన్షన..!
Kethireddy, Jc prabhakar reddy

నేడు తాడిపత్రికి పెద్దారెడ్డి రాక

విగ్రహావిష్కరణకు మున్సిపల్‌ చైర్మన ఏర్పాట్లు

భారీ సంఖ్యలో పోలీసు బలగాలు

తాడిపత్రి ప్రజల్లో ఆందోళన

మాజీ ఎమ్మెల్యేను అడ్డుకుని తీరుతాం: టీడీపీ శ్రేణులు

తాడిపత్రి, ఆగస్టు17(ఆంధ్రజ్యోతి): పట్టణంలో హైటెన్షన. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఐదు వాహనాలు, 40 మందితో సోమవారం ఆయన పట్టణానికి రావడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే విషయంలో అనంతపురం రహదారిలోని ఫ్లైఓవర్‌ వద్ద ఏర్పాటుచేసిన ధ్యానశివుని విగ్రహావిష్కరణకు పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు ప్రజలు రావాలని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి పిలుపునివ్వడంతో సర్వత్రా టెన్షన నెలకొంది. దీంతో పోలీసులకు కంటి మీద కునుకు కరువైంది. తాడిపత్రిలో ఏమి జరుగుతుందోనన్న ఆందోళన, భయం ప్రజల్లో ఉంది. గతంలో పెద్దారెడ్డి పలుమార్లు కోర్టు అనుమతితో తాడిపత్రికి వచ్చేందుకు ప్రయత్నించినా జేసీ ప్రభాకర్‌రెడ్డి, కార్యకర్తలు, నాయకులు అడ్డుకుని తీరుతామని హెచ్చరించడంతోపాటు ఆయన ఇంటివైపు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని, పోలీసులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చిన వెంటనే ఆయనను వెనక్కి పంపిస్తూ వస్తున్నారు. దాదాపు 2024 ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో ఇరువర్గాలను ఊరి నుంచి మూడునెలలపాటు బహిష్కరించారు. అనంతరం ఎన్నికల కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత మూడునెలలకు మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి తాడిపత్రికి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం నేటికీ రాలేదు. పలుసార్లు రావాలని ప్రయత్నించినా జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుకుంటూనే ఉన్నారు. ఈనేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించగా.. పోలీసులే స్వయంగా వెళ్లి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటివద్దకు చేర్చాలని న్యాయస్థానం ఆదేశించినట్లు సమాచారం. శాంతిభద్రతల సమస్య ఉంటే అదనపు బలగాలను వినియోగించాలని స్పష్టం చేసినట్లు పలువురు చెబుతున్నారు. పోలీసులు మాత్రం పెద్దారెడ్డి రాక, శివుని విగ్రహావిష్కరణ రెండూ ఒకేరోజు ఉండడంతో ఎవరికీ చెప్పలేక సతమతమవుతున్నారు. ఇప్పటికే ఇరు నాయకులతో చర్చించినట్లు సమాచారం. తాడిపత్రికి వచ్చి తీరతానని పెద్దారెడ్డి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. శివుని విగ్రహావిష్కరణ ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి చేస్తారనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమం నిర్వహించి తీరుతామని జేసీ ప్రభాకర్‌ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు. దీంతో దాదాపు 450మంది పోలీసులను రప్పిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పట్టణ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Updated Date - Aug 18 , 2025 | 12:51 AM