శిథిలావస్థలో ప్రభుత్వ కార్యాలయాలు
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:15 AM
మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వెలుగు కార్యాలయం పరిస్థితి దారుణంగా ఉంది.
విడపనకల్లు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వెలుగు కార్యాలయం పరిస్థితి దారుణంగా ఉంది. ఈ కార్యాలయంలో బండలు ఎక్కడిక్కడ కుంగిపోయాయి. మీటింగ్ హాలు, అకౌటెంట్ గది, కంప్యూటర్ గది, ఏపీఎం గది, బాత రూంలుల్లోని బండలు పూర్తిగా కుంగిపోయాయి. దీంతో పాములు కార్యాలయంలో తిరుగుతూ ఆ బండల కిందకు చేరుకుంటున్నాయి. ఒక బాతరూం పూర్తిగా శిథిలమై అది పాములకే అన్నట్లు వదిలేశారు. బయటి పక్కన గోడలు కూడా పూర్తిగా నెర్రెలు వచ్చాయి. హౌసింగ్ కార్యాలయం కూడా పూర్తిగా శిథిలమైంది. దాదాపుగా 15 సంవత్సరాలు క్రితం సిమెంట్ తీర్లతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. కానీ బయట వైపు సిమెంట్ ప్లాస్టింగ్ చేయక పోవటంతో వర్షాలకు గది మొత్తం నెమ్మ పట్టి శిథిలమైంది. అక్కడక్కడా నెర్రెలు చీలి పాములు లోపలికి వస్తున్నాయి. నాలుగు రోజలు క్రితం కంప్యూటర్ ఆపరేటర్ టేబుల్ వద్ద పాము చేరుకోవడంతో.. వెలుగు కార్యాలయ అటెండర్‌ను పిలిపించి దాన్ని చంపేయించారు. పాముల భయంలో సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని విధులు నిర్వహిస్తున్నారు. అలాగే తహసీల్దారు కార్యాలయంలో వీఆర్వోల గది కూడా మొత్తం నెర్రెలు చీలింది. కార్యాలయం చిన్నది కావడంతో వీఆర్వోలకు ఇబ్బందిగా మారింది. ఈ భవనాలు ఎప్పుడు కూలుతాయోనని అధికారులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి.. కొత్త భవనాలను మంజూరు చేయించాలని సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు.