Share News

డీపీఓను వెంటాడుతున్న గతం

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:10 AM

జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఏమి జరుగుతోందో అంతచిక్కడం లేదు. డీపీఓ నాగరాజనాయుడును వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలు వెంటాడుతున్నాయి. దీంతో ఆయన ఇక్కడ సరిగ్గా విధులు నిర్వర్తించలేకపోతున్నారని ఆ శాఖలో చర్చ జరుగుతోంది.

డీపీఓను వెంటాడుతున్న గతం
office

నాటి తప్పిదాలతో సతమతం

సంజాయిషీ ఇచ్చుకోవడానికి

పక్క జిల్లా పర్యటనలు

సీనియార్టీ జాబితాలో తిరకాసు

కలెక్టర్‌ చుట్టూ ప్రదక్షిణ

అనంతపురం న్యూటౌన, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఏమి జరుగుతోందో అంతచిక్కడం లేదు. డీపీఓ నాగరాజనాయుడును వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలు వెంటాడుతున్నాయి. దీంతో ఆయన ఇక్కడ సరిగ్గా విధులు నిర్వర్తించలేకపోతున్నారని ఆ శాఖలో చర్చ జరుగుతోంది. జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సీనియర్‌ అసిస్టెంట్‌గా ఇద్దరికి ఉద్యోగోన్నతి కల్పించడానికి తిరకాసు పెడుతున్నారని సమాచారం. కలెక్టర్‌ వద్దకు ఫైౖల్‌ వెళ్లడం, తిరిగి రావడం షరా మామూలుగా మారింది. డీపీఓ కార్యాలయ సిబ్బంది తయారు చేసిన సీనియార్టి జాబితాలో రోస్టర్‌కు విరుద్ధంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో మరోసారి జాబితా మార్చాల్సిన పరిస్థితి నెలకొంది. డీపీఓ నాగరాజనాయుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలకు ప్రస్తుతం సంజాయిషీ ఇవ్వడానికి పక్క జిల్లాకు వెళుతున్నట్లు తెలుస్తోంది. పనిరోజుల్లో మరో జిల్లాకు వెళ్లాలంటే కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి. డీపీఓ అదే మార్గంలో ఏదో ఒక పంచాయతీని తనిఖీలు చేపట్టి, ఎలాంటి అనుమతులు లేకుండానే సంజాయిషీ ఇచ్చుకోవడానికి మరో జిల్లాకు వెళుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకు ప్రధాన సాక్ష్యంగా సంజాయిషీ కోసం తిరుగుతున్న ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నిర్ణయాలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆ శాఖలో చర్చించుకుంటున్నారు.

ఉద్యోగోన్నతుల జాబితాలో గందరగోళం

జిల్లా పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ లీలాబాయి, ధర్మవరం డీఎల్‌పీఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న విజయ్‌కుమార్‌కు నెలన్నర క్రితం ఉద్యోగోన్నతి కల్పించి డిప్యూటీ ఎంపీడీఓలుగా నియమించారు. దీంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. డీపీఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌ కీలకం. వెంటనే అర్హుల జాబితా సిద్ధం చేశారు. కలెక్టర్‌ ఆమోదం కోసం తిరుగుతున్నారు. ఈలోపే గ్రేడ్‌-4 కార్యదర్శులకు గ్రేడ్‌-3 కార్యదర్శులుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. తర్వాత ప్రకటించిన సీనియార్టి జాబితాలో తిరకాసు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. రోస్టర్‌ సరిగా అమలు చేయకపోవడంతో కలెక్టర్‌ చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. దీంతో కొత్త సమస్య మొదలైంది. ఇద్దరికి ఉద్యోగోన్నతి కల్పించడానికి తయారు చేసిన జాబితాలోనే తప్పులు ఉన్నాయి. పదుల సంఖ్యలో ఉద్యోగోన్నతులు కల్పించడానికి సిద్ధం చేసిన జాబితాలో దాదాపు 10 మంది వరకు డిపార్ట్‌మెంట్‌ టెస్ట్‌లు పూర్తి చేయని గ్రేడ్‌-4 కార్యదర్శులకు అవకాశం కల్పించారన్న చర్చ జరుగుతోంది. ఇంకా ఎన్ని తప్పులు ఉంటాయోనని డీపీఓను కలెక్టర్‌ పలు మార్లు తిప్పుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అనుభవం లేనివారితో జాబితా తయారు చేయడంతోనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా పనుల్లో కాలయాపన జరుగుతోంది.

Updated Date - Aug 26 , 2025 | 12:10 AM