ఆక్రమణదారులపై కేసు పెట్టండి
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:00 AM
మండలంలోని కమ్మూరు గ్రామ సమీపంలోని అగ్రిగోల్డ్ భూములను ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు శనివారం ఆ భూములను పరిశీలించారు.
- అగ్రిగోల్డ్ భూములపై సీపీఐ నాయకులు
కూడేరు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కమ్మూరు గ్రామ సమీపంలోని అగ్రిగోల్డ్ భూములను ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు శనివారం ఆ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ సీఐడీ అటాచలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను రాజగోపాల్‌రెడ్డి, సాకే అభిజ్ఞ ఆక్రమించారని తక్షణం వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 252 ఎకరాల్లో ప్లాట్లు వేయగా, ఆక్రమణదారులు ప్రధాన రహదారికి అనుకొని ఉన్న ప్లాట్లను ఆక్రమించి అక్కడున్న భవనంతోపాటు కాంపౌండ్ వాల్ ధ్వంసం చేశారన్నారు. అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన వేల కోట్ల ఆస్తులు సీఐడీ అటాచలో ఉంటే కొందరు వైసీపీ నాయకులు అక్రమంగా రిజిస్ర్టేషన్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర గార్డెన డెవలపర్ పేరుతో ఉన్న 22 ఎకరాల భూమిని 2014లో రాజగోపాల్ రెడ్డి పేరుతో కొనుగోలు చేశారన్నారు. ఆ భూమి మొత్తం సీఐడీ అటాచలో ఉందని, అయినా 2023లో అభిజ్ఞ పేరుతో రిజిస్ర్టేషన పుట్టించారన్నారు. దీనికి తోడు వంకభూములను సైతం రిజిస్ర్టేషన చేశారని, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిప్యూటి తహసీల్దారు ఉదయ్‌భాస్కర్‌కు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు కేశవరెడ్డి, మల్లికార్జున, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర నాయకులు సిద్దేశ్వర, నారాయణప్ప, కుళ్లాయప్ప, పెరుగు సంగప్ప పాల్గొన్నారు.