అనంతపురానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:00 AM
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వైపు వెళ్తున్నాడన్న సమాచారంతో పోలీసుల్లో హైటెన్షన వాతావరణం ఏర్పడింది. చుట్టుపక్కల పోలీసు స్టేషన్లతోపాటు సిబ్బందిని అలర్ట్ చేసి, ఆయా రహదారుల్లో అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
తాడిపత్రి వైపు పెద్దారెడ్డి.. అడ్డుకున్న పోలీసులు
తాడిపత్రి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వైపు వెళ్తున్నాడన్న సమాచారంతో పోలీసుల్లో హైటెన్షన వాతావరణం ఏర్పడింది. చుట్టుపక్కల పోలీసు స్టేషన్లతోపాటు సిబ్బందిని అలర్ట్ చేసి, ఆయా రహదారుల్లో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పెద్దారెడ్డి మాత్రం యల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వైపు రావడంతో బుక్కాపురం వద్ద పోలీసులు అడ్డగించారు. తాను అనంతపురం వెళ్తున్నానని చెప్పినా వారు ఒప్పుకోలేదు. ఆయన కాన్వాయ్ వెంబడే బయలుదేరారు. కొండాపురం సమీపంలో సూరేపల్లి వద్దకు రావడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తాడిపత్రికి వెళ్లకూడదనీ, వెనక్కి వెళ్లాలని చెప్పినా ఆయన వినలేదు. కోర్టు అనుమతి ఉందనీ, తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు మాత్రం ససేమిరా అన్నారు. అంతలోనే మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం నుంచి తిరిగి వస్తున్నాడని తెలియడంతో ఎదురుపడితే ఘర్షణ పడే అవకాశం ఉందన్న ఆలోచనతో పెద్దారెడ్డిని అరగంట ఆపారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి కొండాపురం దాటి వెళ్లిన తర్వాత అనంతపురం వైపు పెద్దారెడ్డిని పంపించారు. మళ్లీ వెనక్కి వస్తాడేమోనని పోలీసులు కాన్వాయ్‌తోపాటు అనంతపురం వరకు వెళ్లారు. ఆయన తిరిగి రాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.